సీజేఐగా గవాయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి

52వ సీజేఐ బాధ్యతలు స్వీకరించిన గవాయ్;

Update: 2025-05-14 10:56 GMT
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

భారత 52 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ కావడంతో ఆయన స్థానంలో గవాయ్ బాధ్యతలు స్వీకరించారు. మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన గవాయ్, ఆరు నెలలకు పైగా సీజేఐగా కొనసాగబోతున్నారు. ఆయన నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేస్తారు. గవాయ్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.

మొదటి బౌద్ధ, రెండో దళిత సీజేఐ
గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి బౌద్దుడు, షెడ్యూల్ కుల సమాజం నుంచి అయిన రెండో వ్యక్తి. ఇంతకుముందు కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టుకు సీజేఐగా వ్యవహరించారు.
గవాయ్ నవంబర్ 24, 1960న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శాలను అనుసరించిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆర్ఎస్ గవాయ్. సిక్కిం, కేరళ గవర్నర్ గా పనిచేశాడు. ఆయన తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు.
గవాయ్ విద్యాభ్యాసం ఎలాంటి సౌకర్యాలు లేని స్థానిక మున్సిపల్ పాఠశాలలో సాగింది. తరగతి గదిలో కింద కూర్చునేవాడు. తండ్రి రాజకీయ నాయకుడిగా ఉండటంతో ఆయన కూడా రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. కానీ తరువాత న్యాయవాద వృత్తి వైపు దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అమరావతి విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్యంలో పట్టభద్రుడయ్యాడు. తరువాత న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1985 లో న్యాయవాది అయ్యాడు.
న్యాయవాద వృత్తి..
గవాయ్ మొదట స్వతంత్ర న్యాయవాదిగా పనిచేశాడు. తరువాత బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ లో ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశాడు. గవాయ్ 2003 లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ముంబైలోని బాంబే హైకోర్టులో దాని నాగ్ పూర్, ఔరంగాబాద్, పనాజీ బెంచ్ లలో కేసులను నిర్వహించారు. తరువాత 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టులో ఆయన దాదాపు 700 బెంచ్ లలో భాగంగా ఉన్నారు. రాజ్యాంగ చట్టం, పర్యావరణ పాలన వాణిజ్య వ్యాజ్యం నేర న్యాయం వంటి రంగాలలో దాదాపు 300 తీర్పులు ఇచ్చారు.
కీలక తీర్పులలో భాగం..
ఆర్టికల్ 300 రద్దును సమర్థిస్తూ ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లదని, 2019 డీమోనిటైజేషన్ పథకాన్ని ధృవీకరించే కీలక తీర్పులను ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ ఒకరు.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో తీస్తా సెతల్వాడ్ కు బెయిల్ మంజూరు చేయడం, ఆప్ నాయకుడు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ మంజూరు చేయడం, మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దోషిగా తేల్చడాన్ని నిలిపివేయడం వంటి ఇతర ముఖ్యమైన తీర్పులలో కూడా పాల్గొన్నారు.
అలాగే నిర్మాణాల అక్రమ కూల్చివేతలో బుల్డోజర్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ దృఢమైన తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఒకరు. షెడ్యూల్డ్ కుల కోటాలో ఉప వర్గీకరణకు మద్దతూ ఇస్తూ తీర్పునిచ్చారు.


Tags:    

Similar News