బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్ చేసిన విపక్షాలు..

కుంభమేళా తొక్కిసలాటపై ప్రకటన చేయాలని డిమాండ్.. ఐదు నిమిషాలకే తిరిగి తమ స్థానాలకు తిరిగి వచ్చిన ఎంపీలు;

Update: 2025-02-01 09:32 GMT

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు.

కొద్దిసేపు నినాదాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది.

తరువాత వెంటనే జనవరి 29న జరిగిన తొక్కిసలాట పై చర్చ చేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం కావాలని ఇండి కూటమి ఎంపీలు సహ ఇతర విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 30 మంది మరణించగా, దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. వీరికి చికిత్స తరువాత ఇంటికి పంపించారు.

సభలో గందరగోళం నెలకొన్న సమయంలోనే ఆర్థికమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు నిమిషాల పాటు నినాదాల తరువాత విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అయితే మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం కొనసాగించడంతో నిమిషాల వ్యవధిలో తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ వాకౌట్ లో పాల్గొన లేదు. సీతారామన్ తన ప్రసంగాన్ని ముగించిన తరువాత విపక్ష ఎంపీలు మరోసారి తొక్కిసలాట అంశాన్ని లేవనెత్తారు.
కాగా, ఈ బడ్జెట్ లో తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన ‘ దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ ’ అనే సూక్తిని తీసుకుని బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతకుముందు కూడా ఆర్థికమంత్రులు తమ బడ్జెట్ ప్రసంగంలో వివిధ కవులు రాసిన పద్యాలు, కవితలను కోట్ చేసేవారు.


Tags:    

Similar News