పట్టపగలు జర్నలిస్ట్ ను కాల్చిచంపిన దుండగులు
అవినీతిని బయటకు తీయడమే కారణమా?;
By : Praveen Chepyala
Update: 2025-03-09 13:15 GMT
యూపీలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. జర్నలిస్ట్, ఆర్టీఐ కార్యకర్త రాఘవేంద్ర బాజ్ పాయ్(36) యూపీలోని సీతాపూర్ లో కాల్చి చంపబడ్డాడు. లక్నో- ఢిల్లీ హైవేలోని మహోలీ ఓవర్ బ్రిడ్జి సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతలో ఈ దాడి జరిగింది.
మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు రాఘవేంద్రను అడ్డగించి పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాజ్ పాయ్ ను స్థానికులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు ప్రకటించారు.
బెదిరింపులు..
దైనిక్ జాగరణ్ లో పనిచేస్తున్న బాజ్ పాయ్ కు గత పదిరోజులుగా బెదిరింపులు వస్తున్నాయి. మహోలీ తహసీల్ లో వరిసేకరణ, భూఒప్పందాల విషయంలో అనేక అవకతవకలు జరడంతో ఆయన వాటిని బయటకు తీశారు.
దీనిఫలితంగా నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంగానే కక్ష పెంచుకున్న పలువురు చంపారని అనుమానం వ్యక్తంచేశారు. అయితే పోలీసులు హత్యపై ఇంకా ఎలాంటి కారణాలు వెల్లడించలేదు.
దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. హత్య జరిగిన తరువాత నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
చెలరేగిన నిరసనలు..
స్థానిక విలేకరి హత్యకు గురవడంతో వందలాది మంది ప్రజలు, స్థానికులు పోస్ట్ మార్టం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
లక్నో రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ సహ సీనియర్ అధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి సీతాపూర్ ను సందర్శించారు. శాంతిభద్రతలను కాపడాటానికి మహోలీ తహసీల్ లో బలమైన పోలీస్ బందోబస్తు పెంచారు.