ముస్లిం మతపెద్ద చెంప చెల్లుమనిపించిన ఎస్పీ కార్యకర్తలు

ఎస్పీ ఎంపీ, అఖిలేష్ యాదవ్ సతీమణీ డింపుల్ యాదవ్ ను విమర్శించడంతో ఆగ్రహంతో దాడి చేసిన యువకులు;

Update: 2025-07-30 10:50 GMT
మౌలానా రషీద్

ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మౌలానా సాజిద్ రషీద్ అనే ముస్లిం మత పెద్దపై కొందరు యువకులు దాడికి తెగబడ్డారు.

వీరు తమకు తాము ఎస్పీ కార్యకర్తలుగా ప్రకటించుకున్నారని తెలిసింది. నోయిడాలోని ఒక వార్తా ఛానెల్ ఇంటర్వ్యూకు సాజిద్ హజరైన సందర్భంలో ఈ దాడి జరిగింది.

దాడి చేసిన యువకులలో ఒకరు సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, మౌలానా రషీద్ పై దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. ఇటీవల మసీద్ ను సందర్శించిన మెయిన్ పురీ ఎంపీ డింపుల్ యాదవ్ పై రషీదీ అవమానకర వ్యాఖ్య చేశారని ఆరోపించారు. ఆయన మంగళవారం నోయిడాలోని ఒక టీవీ ఛానెల్ చర్చాకార్యక్రమానికి వెళ్లారు. అక్కడ యువకులు అతడిని అడ్డగించి చెంప చెల్లుమనిపించారు.

సమాజ్ వాదీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చెప్పుకునే కుల్దీప్ భాటీ సోషల్ మీడియాలోని ఒక సైట్ లో వీడియోను పోస్ట్ చేశారు. అందులో మౌలానా రషీదీ ఇలా ప్రవర్తించారన్నారు. ‘‘భారత్ లోని ఏ మహిళా అయిన అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపట్ల మేము ఇలాగే ప్రవర్తిస్తాము’’ అని ఆయన తన వీడియోలో అన్నారు.
మౌలాన రషీదిపై కుల్దీప్ భాటీ, మోహిత్ నగర్, శ్యామ్ సింగ్ లు దాడి చేసినట్లు, వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఆ సంఘటన గురించి ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ ను అడిగినప్పుడు.. నిందితులు పార్టీ కార్యకర్తలే అని అంగీకరించారు. ‘‘అవును వారు పార్టీ కార్యకర్తలే.. కానీ మా పార్టీ హింసకు మద్దతు ఇవ్వదు’’ అని ఆయన అన్నారు.
వారిపై ఏదైన చర్య తీసుకుంటారా? అని ప్రశ్నించినప్పుడు.. ఎవరైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News