హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్కెచ్ విడుదల

జమ్మూకాశ్మీర్ నుంచి వేలాది పర్యాటకుల తిరుగు ప్రయాణం,;

Translated by :  Praveen Chepyala
Update: 2025-04-23 11:29 GMT
పహల్గాంలో హిందువులపై దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల స్కెచ్ లు

పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల స్కెచ్ లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్థాన్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని వారికి మూసా, యూనస్, ఆసిఫ్ అనే మారు పేర్లు ఉన్నాయని తెలిసింది. ఇంతకుముందు వీరు ఫూంచ్ లో ఉగ్రవాద దాడికి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి.

ఈ స్కెచ్ లు ప్రాణాలతో బయటపడిన వారి సాయంతో తయారు చేసినట్లు జాతీయ మీడియా పలువురు భద్రతా అధికారులను ఉటంకిస్తూ వార్తలు ప్రసారం చేశాయి.
నలుపు, తెలుపు రంగులో ఉన్న పెన్సిల్ స్కెచ్ ల ప్రకారం వారు చిన్న గడ్డాలతో ఆయుధాలు ధరించి ఉన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)మంగళవారం ఈ దాడికి బాధ్యత వహించింది.
సౌదీ పర్యటనను కుదించుకున్న మోదీ..
పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 2019 లో పుల్వామా దాడి తరువాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రి న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి కాశ్మీర్ చేరుకున్నారు.
ప్రస్తుతం షా అక్కడే ఉన్నారు. ఉగ్రవాదులను వెతకడానికి ఎన్ఐఏ బృందం క్షేత్ర స్థాయిలో ఆపరేషన్లు ప్రారంభించింది. ఈ ఉగ్రదాడిలో మరణించినవారిలో 26 మంది హిందువులు, ఒకరు యూఏఈ, ఒకరు నేపాల్ కు చెందిన వారు ఉన్నారు.
పర్యాటకుల వలసలు ప్రారంభం..
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉగ్రవాద దాడిని ఖండించారు. ‘‘ఇటీవల సంవత్సరాలలో పౌరులపై మనం చూసిన అతిపెద్ద దాడి ఇదే ’’ అని అభివర్ణించారు.
మృతుల కుటుంబాలకు జేకే ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఈ ఉగ్రవాద దాడి తరువాత వేలాది మంది పర్యాటకులు కాశ్మీర్ నుంచి బయలుదేరడం ప్రారంభించారు. అధికారులు వారి స్వస్థలాలకు సురక్షితంగా తిరిగి పంపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
పర్యాటకులు తిరిగి వెళ్లిపోవడం చూస్తుంటే తన హృదయం పగిలేలా ఉందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. కానీ ప్రజలు ఎందుకు వెళ్లిపోయారో అర్థమయ్యేలా ఉందని ఆయన అంగీకరించారు.
డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వశాఖ అదనపు విమానాలు నడుపుతున్నాయి. శ్రీనగర్, జమ్మూ ఎన్ హెచ్ 44 ఒకే దిశలో ట్రాఫిక్ కోసం తిరిగి కనెక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి.
అదనపు విమానాలు...
శ్రీనగర్ కు చెందిన ట్రావెల్ ఆపరేటర్ ఐజాజ్ అలీ పీటీఐతో మాట్లాడుతూ.. పర్యాటకుల్లో 80 శాతం మంది తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు. వచ్చే నెల వరకూ ప్యాకేజీలు రద్దు చేసుకున్నారని అన్నారు.
‘‘గత కొన్ని సంవత్సరాలుగా మేము చేసిన కృషి మొత్తం బూడిదలో పోసినట్లు అయింది. కాశ్మీర్ కు పర్యాటకులకు తీసుకురావడానికి మళ్లీ అనేక ప్రయత్నాలు చేయాలి’’ అని చెప్పారు.
జమ్మూకాశ్మీర్ కు ప్రధాన ఆదాయం టూరిజమే. కానీ పాక్ ఉగ్రవాదులు తరుచుగా పర్యాటకులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు.
శ్రీనగర్ మార్గంలో విమాన చార్జీలు పెరగకుండా చూసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వశాఖ విమానయాన సంస్థలను కోరింది. టికెట్ల కోసం ప్రత్యేక కేంద్రాలు, ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.


Tags:    

Similar News