మహా శివరాత్రి సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ఆంక్షలు
ఈ రోజు సాయంత్రం నుంచి నగరమంతా అన్ని వాహనాలను అనుమతి లేదని ప్రకటన;
By : Praveen Chepyala
Update: 2025-02-25 11:26 GMT
మహా శివరాత్రి సందర్భంగా మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ను యూపీ ప్రభుత్వం నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి నగరం మొత్తం వాహానాలు తిరగకూడదని ఉత్తర్వ్వూలు జారీ చేసింది.
రేపటితో కుంభమేళా చివరి ఘట్టానికి చేరుకోవడం, అలాగే శివరాత్రి కావడంతో మరోమారు కోట్లాదిగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటారనే ముందస్తు అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరం మొత్తం కూడా ఆంక్షలు విధించింది. రేపు ఒక్క రోజే దాదాపుగా కోటి నుంచి రెండు కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనాలు ఉన్నాయి.
అయితే ప్రభుత్వం నిత్యావరసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు మాత్రమే రేపు ఈ నిబంధనలు నుంచి మినహయింపు ఇచ్చారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ‘‘ పాలు, కూరగాయలు, మందులు, ఇంధనం, అత్యవసర వాహనాలు, వైద్యులు, పోలీసులు, పరిపాలన సిబ్బందికి ఇందులో మినహయింపు ఉంటుంది’’ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రత్యేక ఘాట్లు
రేపు వచ్చే అశేష భక్తజనానికి ప్రత్యేకంగా ఘాట్లు కేటాయించారు. దక్షిణ ఝాన్సీ మార్గం, ఆరైల్ సెక్టార్ నుంచి వచ్చే వారి కోసం ఆరైట్ ఘాట్, ఉత్తర ఝాన్సీ మార్గం నుంచి వచ్చే వారి కోసం హరిశ్చంద్ర ఘాట్, పాత జీటీ ఘాట్, భరద్వాజ ఘాట్, నాగ వాసుకి ఘాట్, మోరీ ఘాట్, కాళీ ఘాట్, రామ్ ఘాట్, హనుమాన్ ఘాట్ వంటివి కేటాయించారు.
సందర్శకులు శాంతి భద్రతలను కాపాడటానికి విధిగా పోలీసులు భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరింది. జనసమూహాం అధికంగా ఉంటే గంగానదీలో నిర్మించిన పాటూన్ వంతెనలను ఒపెన్ చేసి రెండో ఘాట్ కు పంపిస్తారు.
ప్రత్యేక పోలీస్ బృందాలు
మేళాకు వచ్చే వారి భద్రతను నిర్ధారించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రతా చర్యలు తీసుకుంది. వీటిలో మేళా ప్రాంతంలో ఎటువంటి వాహనాలను అనుమతించరు.
పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేయాలి. అదనంగా అన్ని ప్రధాన రహదారులపై గస్తీ తిరిగేందుకు మోటార్ బైక్ లపై నలభై పోలీస్ బృందాలను మోహరించారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ఏడు మార్గాల్లో డైరెక్టర్ జనరల్ ఇన్ స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులను మోహరించారు.