‘‘ఆపరేషన్ సిందూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు వద్దు’’
సొంతపార్టీ నాయకులకు సూచించిన ప్రధాని మోదీ,;
By : Praveen Chepyala
Update: 2025-05-26 05:36 GMT
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై బీజేపీ నాయకులు వివాదాస్పదంగా మాట్లాడటంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో నాయకులు ప్రతి అంశంపై మాట్లాడకుండా ఉండాలని, అనవసరమైన ప్రకటనలు చేయవద్దని ప్రధాని మోదీ సూచించారని జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రసారం చేసింది.
వివాదాన్ని ఎదుర్కోవడం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తరువాత జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి కొంతమంది బీజేపీ నాయకుల వివాదాస్పద ప్రకటనలు వార్తల్లో పతాకశీర్షికలకెక్కాయి. దీనివలన పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో పడింది.
ఆపరేషన్ సిందూర్ పై మీడియా సమావేశాల్లో భాగంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా, మరో మహిళా అధికారిణి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాటు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించిన కల్నల్ సోఫియా ఖురేషీ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వీడియోలు విస్తృతంగా షేర్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
కల్నల్ ఖురేషీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తప్పుడు భాషను ఉపయోగించినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు సంబంధిత మంత్రిని షాను మందలించింది. శత్రుత్వం, ద్వేషాన్ని పెంచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
తీవ్ర విమర్శలు వ్యక్తం అయిన తరువాత మంత్రి విచారం వ్యక్తం చేశారు. తన సోదరి కంటే కల్నల్ ఖురేషిని తాను ఎక్కువగా గౌరవిస్తున్నానని అన్నారు. అయితే షా క్షమాపణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం అని వ్యాఖ్యానించింది.
బీజేపీ ఎంపీపై విమర్శలు..
ఆపరేషన్ సిందూర్ పై పార్టీ నాయకులు తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం మర్చిపోకముందే మరో ఎంపీ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రామ్ చందర్ జాంగ్రా ఇటీవల విమర్శించారు. వారిలో వీరోచిత లక్షణాలు, ఉత్సాహం లేకపోవడంతోనే బాధితులుగా మిగిలలన్నారు.
హర్యానాలోని భివానీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ జాంగ్రా.. ‘‘భర్తలను కోల్పోయిన స్త్రీలలో యోధుల స్పూర్తి ఉత్సాహం లేవు. ఉగ్రవాదులు చేతులు ముడుచుకున్నందున ఎవరినీ విడిచిపెట్టరు.
మన ప్రజలు చేతులు ముడుచుకుని చనిపోయారు. పర్యాటకులు అగ్నివీర్ శిక్షణలో ఉత్తీర్ణులై ఉంటే, ముగ్గురు ఉగ్రవాదులు 26 మందిని చంపి ఉండేవారు కాదు’’ అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాంగ్రా మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఒక వీడియో సందేశంలో ‘‘నేను నా దేశ మహిళలను ఏ విధంగా బలహీనంగా చూడను.
పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు మేము అండగా నిలుస్తాము. ఆ కుటుంబాలకు అండగా నిలుస్తాము. అయినప్పటికీ నేను ఎవరి మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి నాకు సందేహం లేదు’’ అన్నారు.