రెబెల్స్ పై వేటు వేసిన నితీశ్ కుమార్
ఎన్డీఏ అభ్యర్థులపై పోటీకి దిగిన టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
బీహార్ ఎన్నికలలో రెండు కూటములకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. అయితే మహాఘట్ బంధన్ ఇప్పటికీ సీట్ల పంపకాలపై సిగపట్లు పడుతుండగా, అధికార ఎన్డీఏ పంపకాల ప్రక్రియను పూర్తి చేసి ప్రచారంలో దూసుకుపోతోంది.
తాజాగా రెబెల్స్ పైన ఆ కూటమి దృష్టి పెట్టింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)(JDU) అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మాజీ మంత్రితో సహ పదకొండు మంది నాయకులను బహిష్కరించింది.
పార్టీ నుంచి బహిష్కరించిన నాయకులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు జేడీ(యూ) రాష్ట్ర కార్యదర్శి చందన్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో 11 మంది నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించిన తరువాత పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది’’ అని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.