ఇండి కూటమిలోకి ‘నితీశ్’ రావాలన్నా లాలూ..
మీరు ఏం మాట్లాడుతున్నారన్నా బిహార్ సీఎం;
By : Praveen Chepyala
Update: 2025-01-02 13:12 GMT
బిహార్ సీఎం నితీశ్ కుమార్ తిరిగి ‘ఇండి’ కూటమిలోకి తిరిగి రావాలని మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రతిపాదనలపై ఆయన స్పందించారు. ‘‘ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు..( క్యా బోల్ రహే హైన్) ’’ అని జర్నలిస్టులతో అన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదని జేడీ(యూ) బాస్ అన్నారు.
నిజానికి బిహార్ లో ఒకప్పుడు ఆర్జేడీ, జేడీ(యూ) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. అయితే 2014 ఎన్నికల్లో మోదీ హవాతో ఇరువురు నేతలు చేతులు కలిపారు. దాంతో రెండు సార్లు ఈ నేతలు పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రాణం పోసుకున్న ఇండి కూటమికి బీజం వేసింది నితీశే.. కానీ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన తిరిగి ఎన్డీఏ లో చేరారు.
లాలూ ఆఫర్..
లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం మీడియా ఉత్సుకత తన మీద చూపడానికి మాత్రమే ఇలా మాట్లాడారని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ అన్నారు. పరోక్షంగా ఆయన మాటల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.
లాలూ ఓ టెలివిజన్ ఛానెల్ తో మాట్లాడుతూ... ‘‘ ఆయన(నితీశ్) కోసం మా తలుపులు తెరిచే ఉన్నాయి. అతను తన గేట్లు కూడా విప్పాలి. ఇది రెండు వైపులా నుంచి ప్రజలకు మేలు చేస్తుంది. రాకపోకలను సులభతరం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి నిర్ణయిస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో లాలూ ఈ ప్రతిపాదన చేశారు. ఈ ప్రకటన పై నితిశ్ కు కూడా ఆగ్రహం తెప్పించిందని సమాచారం. దీనిపై మీడియాపై అనేక ఊహగానాలు చెలరేగాయి. రాజ్ భవన్ లో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హజరైన తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కూలుతుందని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఏం స్పందించలేదు.