బిహార్ లో పరివార్ రాజకీయాలకు తెరతీసిన జేడీ(యూ)
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న బీహార్ సీఎం కుమారుడు నిశాంత్ కుమార్;
By : Praveen Chepyala
Update: 2025-02-25 06:11 GMT
బిహార్ లో ఇద్దరు దిగ్గజ నాయకులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ లు రాజకీయ చరమాంకంలోకి చేరుకుంటున్నారు. లాలూ ఇప్పటికే అనధికార రిటైర్మెంట్ ప్రకటించారు.
తన చిన్న కుమారుడు తేజస్వీ ఇప్పటికే రాజకీయాల్లో తన మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో సీఎం నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్నాడా? అంటే అవునని అంటున్నారు స్థానిక రాజకీయ నాయకులు.
అయితే ఇంతకుముందు కుటుంబ రాజకీయాలను నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘పరివార్ పాలిటిక్స్’’ అంటూ విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు ఆయన వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ప్రస్తుతం పాట్నా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..హోలీ పండగ తరువాత ఆయన తనయుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటి వరకూ ‘‘లో ప్రొఫైల్’’ లో ఉన్నారు.
సాప్ట్వేర్ ఉద్యోగి
నిశాంత్ సాప్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా పూర్వ విద్యార్థి. చాలా కాలం పాటు రాజకీయాలకు చాలాదూరంగా ఉన్నాడు. అయితే గత ఏడాది జూలైలో జరిగిన ఓ కార్యక్రమం తరువాత ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఊహగానాలు చెలరేగాయి. అయితే వాటిని ఆయన అప్పట్లో ఖండించారు. తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పారు.
అయితే పార్టీ నాయకత్వం నుంచి మాత్రం ఆయన రాజకీయాల్లోకి వస్తారని పదేపదే సూచనలు వస్తున్నాయి. సీనియర్ జేడీ(యూ) నాయకుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..భవిష్యత్ లో అతను(నిశాంత్) రాజకీయాల్లోకి వస్తాడని అన్నారు.
జేడీ(యూ) స్టేట్ జనరల్ సెక్రటరీ ఫ్రామ్ హన్స్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘బీహార్ చీఫ్ మినిస్టర్ కొడుకు నిశాంత్ కుమార్ అడుగుముందుకు వేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పడానికి నేను సిద్దంగా ఉన్నాను’’ అని అన్నారు.
ఈ ఏడాది భక్తియార్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నిశాంత్ కుమార్.. తన తండ్రికి పట్టం కట్టాలని కోరారు. అతను రాజకీయాలకు ఇంకా 100 శాతం ఫిట్ గా ఉన్నాడని అన్నారు. ఈ ఏడాది చివరల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ నేను బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మరోసారి ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. నా తండ్రిని మరోసారిని సీఎంను చేయాలి. ’’ అని కోరారు. ఈ ప్రకటన తరువాత ఆయన రాజకీయ ఎంట్రీపై ఊహగానాలు చెలరేగాయి.
ప్రస్తుతం బిహార్ లో ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. తనకు ప్రజాదరణ తగ్గుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయ ఎత్తులకు పాల్పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
నితీష్ ఏమంటారో అంటున్న..
అయితే కుటుంబ రాజకీయాలను అప్పట్లో తీవ్ర వ్యతిరేకించే పేరున్న నితీశ్ తన కొడుకు ఎంట్రీని ఏ విధంగా సమర్థిస్తాడో చూడాలి. అయితే ప్రస్తుతం ఛేంజ్ అవుతున్న రాజకీయాల దృష్ట్యా ఆయన ఓకే చెప్తారని అంటున్నారు. పార్టీలోని యువ నాయకత్వం కూడా నిశాంత్ రాక కోసం డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా నిశాంత్ రాజకీయ ఎంట్రీ కచ్చితంగా జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట.