హిట్ అండ్ రన్: ఫౌజా సింగ్ కేసులో ప్రవాస భారతీయుడు అరెస్ట్
నిన్న రోడ్డు దాటుతున్న శతాధిక మారథానర్ ఫౌజా ను కారుతో ఢీ కొట్టి పారిపోయిన థిల్లాన్;
By : Praveen Chepyala
Update: 2025-07-16 11:58 GMT
పంజాబ్ లోని జలంధర్ లో ప్రపంచంలోనే అత్యంత వృద్దుడైన మారథానర్ ఫౌజా సింగ్ ను ఢీకొట్టిన వాహనం డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, నిందితుడు ప్రవాస భారతీయుడు అయిన అమృత్ పాల్ సింగ్ థిల్లాన్ గుర్తించామని పోలీసులు బుధవారం తెలిపారు.
‘‘టర్భన్డ్ టోర్నడో’’గా ప్రసిద్ది చెందిన ఫౌజా సింగ్ తన ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న జలంధర్ లోని తన స్వగ్రామం సమీపంలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనకు ఆస్పత్రికి తరలించగా అక్కడే మరణించాడు.
సీసీఫుటేజీ..
ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు సమీపంలో ఉన్న సీసీటీవీ నుంచి ఫుటేజీ సేకరించారు. ప్రమాదం చేసిన కారు టయోటా ఫార్చునర్ గా గుర్తించారు. ఈ కారు కపుర్తల నివాసి వరీందర్ సింగ్ పేరు మీద రిజిస్టర్ అయింది. అతను తన కారును నిందితుడు థిల్లాన్ కు అమ్మినట్లు పోలీసులకు తెలిపాడు.
నిందితుడు 30 ఏళ్ల ధిల్లాన్ తన కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. అతను వారం క్రితం కర్తార్ పూర్ కు వచ్చాడు. పోలీసులు ధిల్లాన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
తన మొబైల్ ఫోన్ అమ్మిన తరువాత గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని చెప్పాడు. తాను ఢీకొట్టిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, వార్తాపత్రికల ద్వారా తనకు వివరాలు తెలిశాయని చెప్పారు. పోలీసులు థిల్లాన్ ను అరెస్ట్ చేసి ఫార్చునర్ ను స్వాధీనం చేసుకున్నారు.
దిగ్గజానికి నివాళి..
పంజాబ్ అసెంబ్లీ మంగళవారం 114 ఏళ్ల ఫౌజా సింగ్ కు నివాళులు అర్పించింది. శాసనసభ వ్యవహరాల మంత్రి రవ్ జ్యోత్ సింగ్ సభలో సింగ్ కు నివాళులు అర్పించే ప్రతిపాదన ప్రవేశపెట్టారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింబ్ బజ్వా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మారథాన్ రన్నర్ మృతికి సంతాపం తెలిపారు.
ఫౌజా మరణ వార్త తీవ్ర బాధ కలిగించిందని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అన్నారు. ‘‘నేటీ కాలంలో అసాధ్యం అనిపించే 114 సంవత్సరాల వయస్సును ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఆయన సుసాధ్యం చేశారు.
ఆయన అజేయమైన శక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి సందేశం మనందరికి స్పూర్తిదాయకం. ఆయన జీవిత ప్రయాణం భవిష్యత్ తరాలను క్రమశిక్షణ, దృఢ సంకల్పం, సానుకూల ఆలోచనలతో ముందకు సాగడానికి ప్రేరణ ఇస్తుంది’’ అని సైనీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్యరహిత పంజాబ్ కోసం పోరాడుతున్నవారి హృదయాల్లో ఫౌజా సింగ్ వారసత్వం ఎప్పటికి నిలిచి ఉంటుందని భారత మాజీ హకీ కెప్టెన్, జలంధర్ నుంచి కాంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వర్గత్ సింగ్ అన్నారు.
మొదటి శతాబ్ది మారథానర్..
నలుగురు తోబుట్టువులలో చిన్నవాడైన ఫౌజా సింగ్ మారథాన్ ను పూర్తి చేసిన మొదటి శతాధికుడిగా నిలిచాడు. అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని అనేక రికార్డులు తన పేర లిఖించుకున్నాడు.
ఫౌజా సింగ్ లండన్, న్యూయార్క్, హాంకాంగ్ లోని ప్రసిద్ధ మారథాన్ లతో సహ అనేక మారథాన్ లలో పాల్గొన్నాడు. బలహీనమైన కాళ్లతో జన్మించిన ఆయన 90 ఏళ్ల వయస్సులో అద్భుతాలు సాధించాడు. ఫౌజా సింగ్ అంత్యక్రియలు నేడు జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు మంగళవారం జాతీయ మీడియాకు తెలిపారు.