ఢిల్లీలో నలుగురు గ్యాంగ్ స్టర్ల కాల్చివేత
సిగ్మా అండ్ కంపెనీ పేరుతో దోపిడీలు, కిరాయి హత్యలు
By : Praveen Chepyala
Update: 2025-10-23 13:13 GMT
ఢిల్లీ లో నిన్న అర్థరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్ స్టర్లు మరణించారు. ఢిల్లీ పోలీసులు, బీహార్ పోలీసుల సంయుక్త బృందం రోహిణీ ప్రాంతంలో జరిపిన సోదాలలో గ్యాంగ్ స్టర్లు తారసపడటం ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో వీరు మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణిలోని బహదూర్ షా మార్గ్ లో తెల్లవారుజామున 2.20 గంటలకు జరిగిన ఈ ఎన్ కౌంటర్ ఇటీవల సంవత్సరాలలో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇదే.
సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్
పోలీసులు హతమార్చిన గ్యాంగ్ స్టర్లలో రంజన్ పాఠక్(25), బిమ్లేశ్ మహ్తూ అలియాస్ బిమ్లేష్ సాహ్నీ (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) ఉన్నారు. వారు బీహార్ లో ‘సిగ్మా అండ్ కంపెనీ’ నిర్వహిస్తున్నారని తెలిసింది.
ఈ నలుగురూ బీహార్ లోని సీతామర్హి జిల్లాకు చెందినవారు. వీరంతా సాయుధ దోపిడీలు, హత్య కేసుల్లో వాంటేడ్ గా ఉన్నారు. వారిపై బీహార్ లోని దుమ్రా, చౌరత్,గహ్ర, పూర్ణహియాలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా బీహార్ లోని బ్రహ్మశ్రీ సేన జిల్లా అధిపతి గణేశ్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ ల హత్యకు కుట్ర పన్నిందని ఆరోపణ ఉన్నాయి.
కింగ్ పిన్ ఎవరూ?
ఈ ముఠా నాయకుడు రంజన్ సమాచారం ఇచ్చిన వారికి రూ. 25 వేలు రివార్డు ప్రకటించారు. తరువాత సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వచ్చాయి. రంజన్ పై బీహార్ దాని పొరుగు రాష్ట్రాలలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వ్యవస్థీకృత నేర నెట్ వర్క్ ను నిర్వహించాడు.
బీహర్ ఎన్నికలలో..
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిందితులు బీహార్ లో నేరపూరిత కార్యకలాపాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 6న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత వారు బీహార్ లోఒక హత్యకు పాల్పడ్డారని పోలీస్ వర్గాలు తెలిపాయి.
‘‘ఆ ముఠా దాదాపు ప్రతి నెల నేరాలు చేస్తోంది. వారంతా కాంట్రాక్ట్ కిల్లర్లు. తమ ముఠాకు సిగ్మా అండ్ కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. అది వారు ఉద్దేశాలను సూచిస్తుంది. బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ ముఠా గురించి సమాచారాన్ని సేకరించడానికి మేము గణనీయమైన ప్రయత్నం చేసాము’’ అని బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వినయ్ కుమార్ చెప్పినట్లు హిందూస్థాన్ టైమ్స్ ఉటంకించింది.
ఎన్ కౌంటర్ ఎలా జరిగింది..
గత కొన్ని రోజులుగా నిందితులు ఢిల్లీలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో సంయుక్త బృందం ఆపరేషన్ ప్రారంభించింది. తరువాత ఎన్ కౌంటర్ జరిగిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఆపరేషన్ సమయంలో నిందితుడు పోలీస్ బృందంపై కాల్పులు జరిపాడని, ప్రతీకార చర్యకు దారితీసిందని దీని ఫలితంగా నలుగురూ గాయపడ్డారని అధికారి తెలిపారు. వారిని రోహిణిలోని ఆసుపత్రికి తరలించారని, అక్కడే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బీహార్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తరువాత ఢిల్లీ పోలీసులు నిందితుల కదలికలను ట్రాక్ చేశారని అధికారులు తెలిపారు. బీహర్ ఎన్నికలకు ముందు ఈ ముఠా ఒక పెద్ద నేర కార్యకలాపాలకు ప్రణాళిక వేస్తున్నట్లు నిర్థిష్ట నిఘా సమాచారం మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహర్ పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో నిఘా వేసిందని అధికారి తెలిపారు.