ఆర్జేడీలో మొదలైన కుటుంబ పోరు

తేజస్వీ యాదవ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య

Update: 2025-09-21 07:12 GMT
లాలు ప్రసాద్ యాదవ్ తో రోహిణి ఆచార్య

ఆంధ్రలో షర్మిల- జగన్ రాజకీయ వైరం చూశాం.. తాజాగా తెలంగాణలో కవిత- కేటీఆర్ ఎపిసోడ్ చూస్తున్నాం.. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఆధిపత్యమే బీహార్ లోనూ కనిపిస్తోంది.

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ గారల పట్టి, రోహిణి ఆచార్య తమ్ముడు తేజస్వీ యాదవ్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ మధ్య ఎక్స్ లో చేసిన ట్వీట్లు పార్టీలో, కుటుంబంలో లుకలుకలు ఉన్నట్లు బయటపెట్టింది.

అంతకుముందే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.

ఆత్మగౌరవం రక్తంలోనే ఉంది: రోహిణి ఆచార్య ట్వీట్లు
రోహిణీ ఆచార్య(47) శుక్రవారం తన ఎక్స్ లోచేసిన ట్వీట్ కుటుంబంలో లుకలుకలు ఉన్నట్లు బయటకు తెలియజేసింది. ‘‘నేను ఒక కూతురిగా, ఒక సోదరిగా విధులు నిర్వర్తిస్తున్నాను.
అలాగే కొనసాగిస్తాను. నేను ఒక పదవి కోసం ఆరాటపడటం లేదు. నాకు ఎటువంటి రాజకీయ ఆశయాలు లేవు. నాకు ఆత్మగౌరవం అత్యున్నతమైనది’’
మరో పోస్టులో తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆస్పత్రి తీసుకెళ్తున్న వీడియోను షేర్ చేసింది. ‘‘తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్నవారికి నిర్భయత, ధైర్యం, ఆత్మగౌరవం రక్తంలోనే ఉంటాయి’’ అని ఆచార్య రాసుకొచ్చారు.
రోహిణి త్యాగం..
సింగపూర్ లో తన భర్తతో కలిసి గృహిణిగా ఉండాలని నిర్ణయించుకుంది. అక్కడే డాక్టర్ గా సేవలందిస్తోంది. అయితే 2022 లో తన తండ్రికి కిడ్నిని దానం చేసి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.
గత సంవత్సరం సరన్ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగ్రేటం చేసి విఫలమైంది. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటర్ సాధికార్ యాత్ర తరువాత తేజస్వీ యాదవ్ తో కలిసి మరోసారి జనంలో కనిపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తను మరోసారి పోటీ చేయాలని భావించినప్పటికీ తేజస్వీ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నారని ఊహగానాలు చెలరేగుతున్నాయి.
తేజ్ ప్రతాప్..
తన సోదరి ఆచార్యకు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ మద్దతుగా నిలిచాడు. ‘‘రోహిణి నా కంటే చాలా పెద్దది. చిన్నప్పుడు నేను అక్క ఒడిలోనే ఆడుకున్నాను. ఆమె చేసిన త్యాగం ఏ కుమారుడికైనా, తల్లికైనా, సోదరికైన కష్టమే. ఆమె వేదన సమర్థనీయమే’’ అని ట్వీట్ చేశారు.
‘‘ఈ ఎపిసోడ్ లో నేను నా సోదరికి పూర్తిగా మద్దతు ఇస్తాను. ఆమె అవమానించడానికి ధైర్యం చేసే ఎవరైనా సరే సుదర్శన చక్రాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కృష్ణ భక్తుడైన తేజ్ ప్రతాప్ అన్నారు.
ఆర్జేడీలో రక్తపాతం..
ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అధికార ఎన్డీఏ విమర్శలు గుప్పించింది. ‘‘పూర్తి స్థాయి రక్తపాతం వైపు ఆర్జేడీ ప్రయాణిస్తోంది. ఇది చీలిక కాదు, పూర్తి స్థాయి భూకంపం’’ అని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు.
హర్యానాలో జరిగిన గేట్ క్రాష్ లాలూ ప్రసాద్ కుటుంబాన్ని కుదిపేసిందని రాజీవ్ రంజన్ పరోక్షంగా తేజస్వీ సహయకుడు రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తేజస్వీ యాదవ్ అహంకారం, నిరంకుశ ధోరణి కారణంగా అన్నలు, అక్కలు అతడిపై కోపంగా ఉన్నారని ఆరోపించారు.
తేజస్వీ ఏమన్నారంటే..
గత ఏడాది తన మూడో ప్రయత్నంలో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్జేడీ చీఫ్ పెద్ద కుమార్తె మీసా భారతితో కూడా తేజస్వీతో సత్సంబంధాలు లేవని రాజీవ్ రంజన్ అన్నారు.
అయితే తేజస్వీ యాదవ్ వీటిని తోసిపుచ్చారు. పార్టీలో లేదా కుటుంబంలో ఎటువంటి సమస్యా లేదు. ఎన్డీఏ ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News