దేశ రాజధానిలోనూ ‘ఎస్ఐఆర్’ నిర్వహణ: ఎన్నికల సంఘం

2002 నాటి ఎస్ఐఆర్ డేటాను అప్ లోడ్ చేసిన ఎన్నికల సంఘం;

Update: 2025-09-18 05:09 GMT

బీహార్ లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈసీ చట్టం ప్రకారం ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ‘సర్’ ను నిర్వహించడానికి ఈసీ సమాయత్తమవుతోంది.

అధికారిక ప్రకటన ప్రకారం ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి తన రాజ్యాంగ ఆదేశాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రారంభించాలని నిర్ణయించింది.

‘‘ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి రాజ్యాంగబద్దమైన ఆదేశాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది.
సాధారణ ప్రజలకు ఇందుమూలంగా సమాచారం తెలియజేస్తున్నాము’’ అని ప్రకటన పేర్కొంది. విస్తృత ప్రక్రియలో భాగంగా జాతీయ రాజధానిలో ప్రత్యేక రివిజన్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లు పేర్కొంది.
జోరుగా ఏర్పాట్లు..
ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కూడా ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బూత్ స్థాయి అధికారులను నియమించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, బీఎల్ఓలు వంటి సంబంధిత అధికారులందరిని శిక్షణ అందించినట్లు తెలిపింది. ప్రజలు తమ, వారి తల్లిదండ్రుల పేర్లను ధృవీకరించుకోవడానికి 2002 నాటి ఓటర్ల జాబితాను పరిశీలించాలని సీఈఓ కార్యాలయం అభ్యర్థించింది.
‘‘ఎస్ఐఆర్ సమయంలో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్తారు. ప్రజల నుంచి గణన ఫారమ్ లను అవసరమైన పత్రాలతో పాటు సేకరిస్తారు. 2002 అలాగే 2025 ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నవారు 2002 ఓటర్ జాబితా తో పాటు గణన ఫారమ్ మాత్రమే సమర్పించాలి’’ అని ఈసీ పేర్కొంది.
గుర్తింపు..
2002 నాటి ఓటర్ జాబితాలో పేరు లేకపోయిన అతని తల్లిదండ్రుల పేర్లు ఉన్న సందర్భాలలో అతను తన తల్లిదండ్రులకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, గణన ఫారం, 2002 ఓటర్ జాబితా సారాంశాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి ఢిల్లీ సీఈఓ కార్యాలలయం 2002 నాటి సర్ ఓటర్ జాబితాను అప్ లోడ్ చేసింది. అదనంగా ప్రస్తుత అసెంబ్లీ నియోజక వర్గాలను సైతం 2002 నాటి నియోజకవర్గాలతో మ్యాప్ చేశారు. ఇది వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంది.
రాజకీయ వివాదాలు..
2003 తరువాత తొలిసారిగా బీహార్ లో ఓటర్ల జాబితాపై సార్ చేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రక్రియను ప్రజల ఓటు హక్కును హరించే లక్ష్యంతో ఉందని ఆరోపించాయి. ఎలాంటి ధృవీకరణ లేకుండా చాలామంది చట్టబద్దమైన ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శలు చేశారు.
కానీ ఈసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అర్హులైన ఓటర్లతో పాటు అనర్హులను ఏరివేయడమే సర్ లక్ష్యమని రాజ్యాంగం ఎన్నికల సంఘానికి ఆ అధికారం ఇచ్చిందని గుర్తు చేసింది.
సర్ ప్రక్రియ వల్ల బీహార్ లో అంతకుముందు ఉన్న 7.9 కోట్ల ఓట్ల నుంచి 7.24 కోట్ల కు సంఖ్య తగ్గింది. గత ఇరవై సంవ్సరాలలో చనిపోయిన వారి ఓట్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక
బీహార్ లో సార్ ప్రక్రియ ను సవాల్ చేస్తూ అనేక ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని తీసుకువచ్చాయి. ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సర్ లో ఏదైన అవకతవకలు జరిగితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. చెల్లుబాటు అయ్యే పత్రాల కింద ఆధార్ ఉపయోగించడం పై అనేక వివాదాలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు దీనిని గుర్తింపుగా పరిగణించాలని ఆదేశించింది. ఈ అంశంపై అక్టోబర్ 7 న మరో వాయిదా ఉంది.
ఢిల్లీ ఓటర్లు..
ఈ సంవత్సరం ఢిల్లీ సీఈఓ కార్యాలయం విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్రకారం.. దేశ రాజధానిలో 1,55,24,858 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. వీరిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 థర్డ్ జెండర్లు ఉన్నారని వెల్లడించింది.


Tags:    

Similar News