ఢిల్లీ: అతీషి ఇంటి ముందు మహిళల నిరసనలు.. ఎందుకంటే..
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పదే పదే హమీ ఇచ్చిన పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళలు ఆర్థికమంత్రి..
By : Praveen Chepyala
Update: 2024-06-11 12:58 GMT
ఆప్ ప్రభుత్వం తమకు బడ్జెట్ లో ఇచ్చిన హమీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ మహిళలు ఢిల్లీ ఆర్ధికమంత్రి ఆతిషీ ఇంటి ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహిళా ఓటర్లు ఆకర్షించడానికి ఆప్ ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు రూ. 1000 ఇస్తామని వెల్లడించింది. దీని అమలుపై ఇక్కడి మధుర రోడ్డులోని మంత్రి నివాసం వెలుపల ఆందోళనకారులు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
"ఆప్ ప్రభుత్వం తన బడ్జెట్‌లో మహిళలకు నెలకు రూ. 1000 గౌరవ వేతనం ప్రకటించింది. ఇది ఎన్నికల హామీ కాదు. బడ్జెట్ లో చెప్పారు. కాబట్టి, ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు డబ్బు అందించాలి" అని నిరసనకారులలో ఒకరైన సఫియా ఫహీమ్ అన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసు అధికారి తెలిపారు.
మంత్రి అతిషి ఇంటి ముందు కొందరు మహిళలు నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నందున ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై ఢిల్లీ ఆర్థికమంత్రి స్పందిస్తూ .. బీజేపీ మహిళా విభాగం వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సాధించడానికి ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడుతోందని విమర్శించారు.
'బీజేపీ మహిళా విభాగం నిరసన చేపట్టింది. ఇది బీజేపీ తెగింపును తెలియజేస్తోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని వారికి తెలుసు, రూ. 1,000 ఇస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరుస్తారని వారికి తెలుసు. ఆయన పేరు మీద అక్కడక్కడా కొన్ని ఓట్లను తొలగించేందుకు ఇలాంటి నిరసనలు చేస్తున్నారు' అని ఆమె అన్నారు. అయితే ఆతీషీ మాటలను పీటీఐతో మాట్లాడిన ఫహీమ్ ఖండించారు. తాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో భాగం కాదన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.1000 అందజేస్తానని పదేపదే హామీ ఇచ్చారు.
AAP ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన 2024-25 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలోని వయోజన మహిళలకు నెలకు రూ. 1000 అందించాలని ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన తర్వాత ఈ పథకాన్ని నోటిఫై చేసే అవకాశం ఉందని అతిషి గతంలో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఈ పథకం అమలులోకి వస్తుందని ఆమె అంచనా వేశారు.