ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి: రాష్ట్రపతిని కోరిన బీజేపీ

దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని వెంటనే దీనిని సరిచేయాలని బీజేపీ రాష్ట్రపతిని కోరింది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని వెంటనే రద్దు

By :  491
Update: 2024-08-31 06:21 GMT

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్రపతిని కోరింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేల నేతృత్వంలోని బృందం శుక్రవారం ప్రెసిడెంట్ ను కలిశారు.

ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా నేతృత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. "ఢిల్లీని పీడిస్తున్న రాజ్యాంగ సంక్షోభం"లో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అధికారికంగా ఆమెకు విజ్ఞప్తి చేసింది. అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం జైలులో ఉండడంతో ఆప్ ప్రభుత్వ పనితీరులో మార్పు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆప్ ప్రభుత్వం "పాలించే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని స్వార్థానికి వినియోగించుకుంది’’ అని మెమోరాండం లో బీజేపీ పేర్కొంది. తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ నాలుగు నెలలకు పైగా జైలులో ఉండడంతో "పరిపాలన పక్షవాతం" వచ్చిందని గుప్తా విమర్శించారు.
"కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి నిరాకరించారు, ఇది అపూర్వమైన పరిస్థితిని సృష్టించింది, ఇది ఢిల్లీలో పాలన పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి దారితీసింది. క్లిష్టమైన పరిపాలనా నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి. అవసరమైన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, ఈ పరిణామాలన్నీ నేరుగా ఢిల్లీ పౌరుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి" అని ఆయన అన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘన
ఆప్ ప్రభుత్వం " రాజ్యాంగ ఉల్లంఘనలకు" పాల్పడుతోందని కూడా మెమోరాండమ్ లో బీజేపీ ఆరోపించింది. " ముఖ్యంగా, ఏప్రిల్ 2021 నుంచి ఆరవ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలం అయిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243- ఐ, 243- వై ని ఉల్లంఘించడమే అని తన మొమోరాండమ్ లో కమల దళం ఆరోపించింది. ఇది సరైన ఆర్థిక ప్రణాళిక, వనరుల కేటాయింపును తీవ్రంగా అడ్డుకుంది. నగరం, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ప్రభావితం చేస్తుంది" అని పేర్కొంది.
ఢిల్లీ అసెంబ్లీలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)తో సహా ముఖ్యమైన నివేదికలను సమర్పించడంలో ఆప్ ప్రభుత్వం "పదేపదే వైఫల్యం చెందినట్లు" కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ఢిల్లీలో కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగిందని మెమోరాండం పేర్కొంది.
"ఈ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలు, పాలనా వైఫల్యాల దృష్ట్యా, మేము, ఢిల్లీ శాసనసభ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించి, ఢిల్లీలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గౌరవపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాము" అని వారు పేర్కొన్నారు.
గుప్తాతో పాటు, బిజెపి ప్రతినిధి బృందంలో మోహన్ సింగ్ బిష్త్, ఓం ప్రకాష్ శర్మ, అజయ్ మహావార్, అభయ్ వర్మ, అనిల్ బాజ్‌పాయ్, జితేందర్ మహాజన్, కర్తార్ సింగ్, ఇటీవల ఆప్ నుంచి వైదొలిగి బిజెపిలో చేరిన మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఉన్నారు.
బీజేపీని విమర్శించిన ఆప్..
ఈ మెమోరాండం సమర్పణ పై ఆప్, బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీ గత దశాబ్ద కాలంగా గెలవలేని చోట ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వపు పనికి అంతరాయం కలిగించేందుకు ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఇక్కడ సమాంతర ప్రభుత్వం నడపాలని వాంఛిస్తోందని ఆప్ పేర్కొంది.
"అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బిజెపి రాష్ట్రపతిని సంప్రదించడం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వారు ఓటమిని అంగీకరించినట్లు తెలియజేస్తోంది" అని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఢిల్లీ ఎన్నికలలో గెలవలేమని బిజెపికి తెలుసు, శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి చేపట్టడానికి ఆపరేషన్ లోటస్ ఘోరంగా విఫలమైంది. ఎన్నికల్లో గెలవాలని వారు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి" అని ఆప్ విమర్శలు గుప్పించింది.
ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న బీజేపీ, కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనేతలందరినీ "జైలు" పంపింది. మద్యం కుంభకోణం అనే కట్టుకథలో నిజాయితీగా ఉన్న నాయకులను జైలుకు పంపి, వారి పరువు తీయడానికి ప్రయత్నించారని, ఆప్ ను అణగ దొక్కడానికి అనేక రాళ్లను బీజేపీ విసిరేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News