మధ్యప్రదేశ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు
ఛాంపియన్ ట్రోఫి సందర్భంగా విజయోత్సవ వేడుకలు జరిపిన యువకులు, రాళ్లదాడి జరిపిన మరో వర్గం యువకులు;
By : Praveen Chepyala
Update: 2025-03-10 05:35 GMT
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి గెలుపు తరువాత కొంతమంది యువకులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీపై వేరే వర్గానికి చెందిన వారు రాళ్లదాడి జరిపారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాని మోహ్ పట్టణంలో ఆదివారం కొంతమంది యువకులు భారత క్రికెట్ జట్టు గెలిచన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
అయితే యువకులు ఓ మసీద్ ప్రాంగణం దగ్గరకు వెళ్లగానే అనూహ్యంగా రాళ్లదాడి ప్రారంభమైంది. దీంతో యువకులు తమ వాహానాలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. తరువాత మసీద్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది ఆ వాహనాలకు నిప్పు పెట్టారు.
మోహ్ పట్టణం ఇండోర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అదనపు బలగాలను పంపామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ‘‘ఇది ఎలా జరిగిందో తరువాత తెలుస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. అదనపు బలగాలను మోహరించాం’’ అని చెప్పారు.
‘‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫి గెలిచాక విజయోత్సవం జరుపుకోవడానకి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత రాళ్లదాడి ప్రారంభమైంది.’’ అని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నిమిష్ అగర్వాల్ తెలిపారు.
కాల్పుల ఘటనలు..
రాళ్లదాడి తరువాత కొన్ని రౌండ్ల తుఫాకీ కాల్పులు వినిపించాయని కొంతమంది అధికారులు తెలిపారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భయాందోళనలకు దారితీశాయని స్థానికులు తెలిపారు.
న్యూజిలాండ్ పై భారత్ సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి ప్రయత్నించిన సమయంలో యువకులపై రాళ్లదాడి జరిగింది. దీంతో అక్కడంత గందరగోళం నెలకొంది. జామా మసీదు ప్రాంతంలో ఈ గొడవ జరిగిందని అన్నారు. తరువాత స్థానిక అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు.
ఇండోర్ పోలీసులు..
ఇండోర్ గ్రామీణ పోలీస్ సూపరింటెండెంట్ హితికా వాసల్ పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి గొడవ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. శాంతి భద్రతలను పునరుద్దరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మోహ్ చేరుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. హింసను కట్టడి చేయడానికి ప్రభావిత ప్రాంతంలో సిబ్బందిని మోహరించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఘర్షణ గురించి సమాచారం అందుకున్న తరువాత బలగాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అగర్వాల్ తెలిపారు. ‘‘ అక్కడ పోలీస్ బలగాలను మోహరించాం. ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు’’ అని ఆయన అన్నారు.