బీజేపీ బీహార్ లో అతిపెద్ద సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అది పోటీ చేసిన 101 స్థానాలలో ఏకంగా 89 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. దాని మిత్రపక్షం జేడీ(యూ) 85 స్థానాలు గెలుచుకుంది.
కేంద్రమంత్రి చిరాగా పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్ శక్తి పార్టీ(ఎల్జేపీ- ఆర్) 19 సీట్లు సాధించింది. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్ అవామ్ మోర్చా ఐదు స్థానాలు, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా నాలుగు స్థానాలలో పాగా వేశాయి.
ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా, రాష్ట్ర మంత్రులు ప్రేమ్ కుమార్, మహేశ్వరి హజారీ, సంజయ్ సరోగి, బీజేపీకి చెందిన మైథిలీ ఠాకూర్ లు కూడా విజయం సాధించారు.
తుస్సుమన్నా ‘ఇండి’ కూటమి
ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కేవలం 35 స్థానాలు మాత్రమే సాధించింది. ఇందులో ఆర్జేడీ సొంతంగా 25 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించారు. హైదరాబాద్ కు చెందిన ఏఐఎంఐఎం సీమాంచల్ లో ఐదు స్థానాలు గెలుచుకుంది.
బీఎస్పీ, ఇండియన్ ఇన్ క్లూజివ్ పార్టీ ఒక్కొక్క స్థానంలో విజయం సాధించాయి. తేజస్వీ యాదవ్, ఒసామా షాహబ్ సీపీఐ(ఎంఎల్), సౌరవ్ లు ప్రతిపక్షంలో గెలిచిన ముఖ్య నాయకులు. తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి 14,532 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన సతీష్ కుమార్ ను ఓడించారు.
అతిపెద్ద మెజార్టీ..
బీజేపీకి చెందిన ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి 45,843 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖసరై నుంచి 24,940 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అమరేశ్ కుమార్ ను ఓడించారు.
తొలిసారి పోటీచేసిన యూట్యూబర్, ప్రముఖ సింగర్ మైథిలీ ఠాకూర్ అలీ నగర్ స్థానం నుంచి 11,730 ఓట్లతో గెలుపొందారు. ఈమె ఆర్జేడీకి చెందిన బినోద్ మిశ్రా ను ఓడించారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో వ్యవసాయమంత్రిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ 1990 నుంచి గెలుస్తున్నా గయా టౌన్ సీట్ నుంచి మరోసారి గెలిచారు. ఆయన కాంగ్రెస్ కు చెందిన అఖౌరీ ఓంకార్ నాథ్ ను 26 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
నితీశ్ కుమార్ క్యాబినేట్ లో మంత్రిగా ఉన్న హజారీ మరోసారి కల్యాణ్ పూర్ నుంచి గెలిచారు. ఆయన సీపీఐ(ఎంఎల్) నాయకుడు రంజీత్ కుమార్ ను 38 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఆయన ఈ స్థానంలో గెలవడం ఇది నాలుగోసారి. దర్భంగా నుంచి వరుసగా ఐదోసారి సరోగి గెలిచారు. ఆయన వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ఉమేష్ సాహ్నిని 24,500 ఓట్లతో ఓడించారు.
ఇతర విజేతలలో బీజేపీ కి చెందిన మాజీ మంత్రి రాణా రణధీర్ సింగ్, డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అనంత్ సింగ్ భార్య ఈ ఎన్నికలలో గెలిచారు. అనంత్ సింగ్ మరో డాన్ జన్ సురాజ్ మద్దతుదారుడు అయిన దులార్ చంద్ర యాదవ్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు.
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఆర్) కు రాష్ట్ర అధ్యక్షుడు అయిన రాజు తివారీ కూడా 32 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికలలో బీజేపీ, జేడీ(యూ) చెరో 101 సీట్లలో పోటీ చేయగా, ఎల్జేపీ 28 స్థానాలలో పోటీకి దిగాయి.
ఇండి బ్లాక్ లో ఆర్జేడీ 141 స్థానాలలో పోటీకి దిగింది. కాంగ్రెస్ 61 స్థానాలలో , సీపీఐ(ఎంఎల్) 20 స్థానాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
గెలిచిన స్థానాలు..
ఎన్డీఏ 202
బీజేపీ: 89
జేడీయూ: 85
ఎల్జేపీ(ఆర్): 19
హెచ్ఏఎం: 5
ఆర్ఎల్ఎం: 4
మహాఘట్ బంధన్: 35
ఆర్జేడీ: 25
కాంగ్రెస్: 6
సీపీఐ- ఎంఎల్ 2
ఐఐపీ: 1
సీపీఐ: ఎం: 1