రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఆప్ ఓటు హక్కు కల్పిస్తోంది: బీజేపీ
అన్నీ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ సెగ్మంట్ లోనే నమోదవుతున్నాయన్న కమలదళం
By : Praveen Chepyala
Update: 2024-12-25 06:09 GMT
ఢిల్లీ ఎన్నికల్లో మూడోసారి ఎన్నిక కావడానికి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఆప్ ఓటు హక్కు కల్పిస్తోందని బీజేపీ విరుచుకుపడింది. వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి అక్రమంగా పత్రాలను సృష్టిస్తున్నారని అందుకు తగ్గ మార్గాలు అనుసరిస్తున్నారని కాషాయ దళం విమర్శల వర్షం కురిపించింది.
ప్రత్యర్థి ఆరోపణలపై ఇప్పటి దాకా ఆప్ పార్టీ స్పందించలేదు. ఈ అంశంపై బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మాకు తెలుసు వాళ్లు మా పార్టీకి ఓటు వేయరు. వాళ్లు కేవలం ఆప్ కు ఓటు బ్యాంకు’’ అన్నారు.
అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు స్థానిక ఆప్ లీడర్లు నివాస సదుపాయాలు కల్పిస్తున్నారని, వీరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల వంటివి ఇప్పిస్తున్నారని ఆరోపించారు. వీటి ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయించాలని ప్రయత్నిస్తున్నరని వర్మ ఆరోపించారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మంట్ లోని కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు ఉన్నాయని, దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా మెజీస్ట్రేట్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మంట్ లో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు ఢిల్లీలో ఎప్పుడూ చూడలేదని, వెంటనే ఎన్నికల సంఘం అక్రమ వలసదారులకు కల్పించిన ఓటు హక్కుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీని మూడో సారి ఛేజిక్కించుకోవడానికి అక్రమ ప్రయత్నాలకు తెరలేపారని అన్నారు. అయితే ఆయనకు ఓటమి తథ్యమని పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం బీజేపీ టీమ్ అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు ఓటు హక్కు ఇస్తున్నారని, ఇందులో ఆప్ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరు అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు ఆధార్, రేషన్ కార్డులు అందజేస్తూ వారికి ఆవాసాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొంతమంది బంగ్లాదేశీలను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్రమంగా డాక్యుమెంట్లు పొంది భారతీయులుగా చెలమణి అవుతున్నారు.
ఓ పోస్టులో ఆప్ అధినేత ఎవరిపేరు లేకుండా ‘‘ వాళ్లు ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగా ఒక్కో ఓటుకు రూ. 1000 ఇస్తున్నారు. ’’ అని ఎవరి పేరు లేకుండా ఈ పోస్టు చేశారు. ప్రజలు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆప్ కు ఓటు వేయాలని ట్వీట్ చేశారు.