‘‘ నీ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’

పాకిస్తాన్ కాల్పుల్లో మృతి చెందిన మణిపూర్ జవాన్, సంతాపం ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-12 07:13 GMT
అమరుడైన బీఎస్ఎఫ్ జవాన్ , దీపక్ చిమ్ గాఖమ్

ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ దీపక్ చిమ్ గాఖమ్ మృతి చెందాడు. సైనికుడి మృతికి మణిపూర్ లోని బీజేపీ, కాంగ్రెస్ సోమవారం సంతాపం ప్రకటించాయి. అమరుడి సేవలు చిరకాలం గుర్తు పెట్టుకుంటామని అన్నారు.

జమ్మూకాశ్మీర్ లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగిన కాల్పుల్లో గాయపడిన ఎనిమిది మంది బీఎస్ఎఫ్ సిబ్బందిలో మణిపూర్ కు చెందిన దీపక్ ఒకరు. ఆయన ఆదివారం చికిత్స పొందుతూ మరణించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవీ మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎస్ పురా సెక్టార్ సరిహద్దు కాల్పుల సమయంలో దేశానికి ధైర్యంగా సేవచేస్తూ ప్రాణ త్యాగం చేసిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ దీపక్ చిమ్ గాఖమ్ మృతి మాకు తీవ్ర బాధ కలిగించింది’’ అన్నారు. దీపక్ మణిపూర్ కు గర్వకారణమైన పుత్రుడని, ఆయన ధైర్యం, భక్తి, మణిపురి ప్రజల అచంచల స్ఫూర్తిని నిబద్దతను ప్రతిబింబిస్తాయని ఆమె అన్నారు.
‘‘మేము అతని ధైర్యసాహాసాలను గౌరవిస్తాము. ఈ దు:ఖ సమయంలో అతని కుటంబం, సహచరులకు అండగా నిలబడతాము. అతని త్యాగం ఎప్పటికీ మర్చిపోలేము’’ అని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
దీపక్ ఇంఫాల్ తూర్పుజిల్లాలోని యైరిపోక్ యంబెం కు చెందిన వాడు, తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు ఉన్నాడు. జవాన్ మృతికి కాంగ్రెస్ పార్టీ కూడా సంతాపం తెలిపింది.
‘‘మణిపురి ప్రజలతో పాటు దేశం మొత్తం అతని ధైర్యం, నిబద్దతకు గర్విస్తోంది. మన మాతృభూమి కోసం ఆయన చేసిన అత్యుత్తమ త్యాగానికి మేము సదా గుర్తుంచుకుంటాము. ఆయన కుటుంబానికి, తోటీ సైనికులకు హృదయపూర్వకంగా సంతాపం తెలియజేస్తున్నాము. ఈ అపారమైన దు:ఖ సమయంలో భగవంతుడు వారికి బలాన్ని ప్రసాదించాలి’’ అని కీషమ్ అన్నారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, అన్ని శ్రేణులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ చేసిన కాల్పుల్లో కానిస్టేబుల్ దీపక్ చిమ్ంగాఖమ్ మే 10 న గాయపడ్డాడని, మే 11 న చికిత్స పొందుతూ మరణించాడని బీఎస్ఎఫ్ సోషల్ మీడియా ప్రకటనలో తెలిపింది. సోమవారం బీఎస్ఎఫ్ సరిహద్దు ప్రధాన కార్యాలయంలో దీపక్ కు పుష్పగుచ్ఛం అందించి నివాళులర్పిస్తారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించిన తరువాత బీఎస్ఎఫ్, పాకిస్తాన్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.


Tags:    

Similar News