నేవీలోకి ఉదయగిరి, హిమగిరిల చేరిక

భారత నావికాదళ చరిత్రలో ఒకేసారి రెండు యుద్ధనౌకలను నేవీలోకి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్నంలో ప్రవేశపెట్టారు.;

Update: 2025-08-26 15:26 GMT
నేవీలో చేరిన యుద్ధనౌకలు ఉదయగిరి, హిమగిరిలు

ఇండియన్‌ నేవీ రోజు రోజుకు తన శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది. తాజాగా అత్యాధునిక యుద్ధనౌకలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. నీలగిరి శ్రేణి ప్రాజెక్టు 17ఎ మల్టీ మిషన్ స్తెల్త్‌ ఫ్రిగేట్లు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి అనే ఈ యుద్ధనౌకలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం విశాఖ నేవల్‌ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో అట్టహాసంగా నేవీలోకి ప్రవేశపెట్టారు. ఒకేసారి రెండు యుద్ధనౌకలను నేవీలోకి ప్రవేశపెట్టడం భారత నేవీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. వీటిని రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిర్మించారు. ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరిలు ప్రాజెక్టు 17 (శివాలిక్‌) తరగతి యుద్ధనౌకల తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు నౌకలు డిజైన్, స్టెల్త్, ఆయుధం, సెన్సార్‌ వ్యవస్థల్లో గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ప్రతికూల బ్లూ వాటర్‌ పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి సముద్ర కార్యకలాపాలను నిర్వహించగలుగుతాయి.


ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి

వేర్వేరు చోట్ల ఈ యుద్ధనౌకల నిర్మాణం
ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లోను, ఐఎన్‌ఎస్‌ హిమగిరి కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌లోను నిర్మించారు. భారత షిప్‌యార్డులు అనుసరించిన మాడ్యులర్‌ నిర్మాణ పద్ధతి ఫలితంగా ప్రయోగించిన తర్వాత అత్యంత వేగవంతమైన నౌకగా ఉదయగిరి ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రముఖ పూర్వీకుల పేర్లను పునరుద్ధరించే నేవీ సంప్రదాయానికి అనుగుణంగా ఈ యుద్ద నౌకలకు పూర్వం నేవీకి సేవలందించిన ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి అనే పేర్లను పెట్టారు. అత్యాధునికంగా సరికొత్త సామర్థ్యం కలిగి ఉండేలా వీటిని రూపొందించారు. వీటికి నేవీ యుద్ధనౌక డిజైన్‌ బ్యూరో రూపకల్పన చేసింది. ఈ బ్యూరో రూపొందించిన నూరవ యుద్ధనౌక ఉదయగిరి కావడం మరో విశేషం. ఇది ఐదు దశాబ్దాల పాటు సేవలందిస్తుంది. ఈ నౌకలలో ఆధునిక కంబైన్డ్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ ప్రొపెల్షన్‌ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫాం, మేనేజిమెంట్‌ సిస్టం, దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతన ఆయుధాలు, సెన్సార్ల సూట్‌ ఉన్నాయి. సముద్ర రక్షణలో ఇవి భారత నావికాదళంలో కీలకం కానున్నాయి. అద్భుతమైన ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు వీటి సొంతం. ఈ నౌకలు 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 200 స్వదేశీ ఎంఎస్‌ఎంఈల సహకారంతో తయారయ్యాయి.

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, హిమగిరిలకు రాజనాథ్‌సింగ్‌ సెల్యూట్‌

ఉదయగిరికి మన పర్వత శ్రేణి పేరే..
మంగళవారం నేవీలోకి ప్రవేశపెట్టిన యుద్ధ నౌకల్లో ఒకటైన ఐఎన్‌ఎస్‌ ఉదయగిరికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జల్లా పర్వత ప్రాంతమైన ఉదయగిరి పేరును పెట్టారు. 1976లో ప్రవేశపెట్టిన యుద్ధనౌకకు కూడా ఈ పేరే పెట్టారు. 2007లో ఈ యుద్ధనౌక తన సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఆ పేరునే ఈ కొత్త నౌకకు పెట్టారు. ఇక 1974లో నేవీలో చేరిన ఐఎన్‌ఎస్‌ హిమగిరి పశ్చిమ నేవీలో సేవలందించింది. 2005లో దీని సేవల నుంచి ఉపసంహరించారు. తాజాగా వచ్చిన మరో యుద్ధ నౌకకు హిమగిరి పేరును పెట్టారు.

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిని లాంఛనంగా ప్రారంభిస్తున్న రాజనాథ్‌సింగ్‌

తూర్పు నావికాదళానికి సేవలు..
నేవీలోకి ఈ రెండు యుద్ధనౌకలు చేరడం ద్వారా భారత నావికాదళ శక్తి సామర్థ్యాలు మరింత ద్విగుణీకృతమవుతాయి. ఈ రెండు నౌకలు తూర్పు నౌకాదళంలో సేవలందిస్తాయి. హిందు మహాసముద్రం ప్రాంతమంతటా భారత దేశ సముద్ర జల ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతతో పనిచేస్తాయి. ప్రాజెక్టు 17ఎ కింద నిర్మించిన తొలి యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ నీలగిరిని ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నీలగిరి శ్రేణిలో ఏడు గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు. ఇవి శివాలిక్‌ శ్రేణి యుద్ధనౌకలకు కొనసాగింపుగా ఉంటాయి. నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి, యుద్ధనౌకలను మజగావ్‌ డాక్‌లోను, హిమగిరి, దునాగిరి, వింధ్యాగిరిలను గార్డెన్‌ రీచ్‌లోనూ నిర్మిస్తున్నారు. శనివారం నాటి కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెండాద్కర్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News