బీరేన్ సింగ్ ను తిరిగి తేవడానికే రాజీనామా చేయించారా?
మణిపూర్ లో రాజకీయాలను చక్కబెట్టేందుకే శాసనసభను రద్దు చేయకుండా వేచి చూస్తున్నారన్న కాంగ్రెస్;
By : 218
Update: 2025-02-10 07:28 GMT
మణిపూర్ లో హింస చెలరేగిన తరువాత చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ చివరకు రాజీనామా చేశాడు. స్వంత పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ముందస్తుగానే రాజీనామా చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రెబెల్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మధ్య పొత్తు కుదర్చడంలో విఫలం కావడంతో ఆయన పీఠం దిగిపోక తప్పలేదు.
నష్ట నియంత్రణ
అమిత్ షాతో కలిసి ప్రభుత్వం భవిష్యత్ గురించి చర్చించడానికి బీరేన్ సింగ్ ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ లోనే అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ముందుముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవాలంటే బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది.
సమావేశం అయ్యాక రాజధాని ఇంఫాల్ వచ్చిన బీరెన్ సింగ్, ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జీ సంబిత్ పాత్ర, ఇంకొంత మంది మంత్రులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా సమర్పించారు.
దిక్కుతోచని స్థితిలో..
రాజీనామా సమర్పించిన తరువాత దాన్ని ఆమోదించిన గవర్నర్ అజయ్ కుమార్ భల్లా.. ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని బీరేన్ ను కోరారు. ప్రస్తుతం మణిపూర్ శాసనసభను రద్దు చేయలేదు. దాన్ని కేవలం సస్పెండ్ యానిమేషన్ లో ఉంచడం గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
మణిపూర్ శాసనసభ సమావేశాన్ని 12న ఏర్పాటు చేయాలన్న జనవరి 24న జారీ చేసిన మునుపటి ఉత్తర్వులను గవర్నర్ అలాగే కొనసాగిస్తున్నారు. సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది.
చివరి ప్రయత్నం..
రాష్ట్రపతి పాలన విధించే బదులు బిరెన్ ను అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కొత్త నాయకుడిగా ఎంపికలో బీరెన్ సింగ్ ప్రభావాన్ని వాడుకోవాలని అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
‘‘ఈ ఏర్పాటు వల్ల బీరేన్ అధికారంలోకి రాలేరు. అపధర్మ ముఖ్యమంత్రిగా ఓ ప్రభావంతమైన స్థానంలో కొనసాగుతారు. ఇది తన వారసుడిని ఎన్నుకోవడానికి పనికి వస్తుంది. ఇది కొంచెం సమయాన్ని సైతం అందజేస్తుంది’’ అని మణిపూర్ కు చెందిన రాజకీయ పరిశీలకుడు కవి మారమ్ అన్నారు.
బీరేన్ కి కాస్త..
మణిపూర్ కాంగ్రెస్ శాఖ కూడా ఈ చర్య ను బీరేన్ కు కొంతసమయం ఇచ్చేందుకు తీసుకున్న చర్యగా భావిస్తోంది. ‘‘ ఇది మాజీ సీఎంకు సమయం ఇచ్చేందుకు వేసిన ఎత్తుగడ. కానీ అతని నిష్క్రమణ ను ఆపే ఏ ప్రయత్నం అయినా, మేము దాన్ని అడ్డుకుంటాం’’ అని మణిపూర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే హెచ్ దేవబ్రత అన్నారు.
అయితే బీరెన్ రాజీనామా తో అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయి తమ భవిష్యత్ కార్యాచరణను చర్చించినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై తమ వాదనను వినిపించడానికి ఇన్ చార్జీ సంబిత్ పాత్రాను కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ శారదాదేవీ, స్పీకర్ తోక్ చోమ్ సత్యబ్రత సింగ్, వై ఖఏమ్ చంద్ సింగ్ ప్రస్తుతం సీఎం పదవికి పోటీపడుతున్నారు.
పరిస్థితులను తట్టుకుని నిలబడాలి..
బీఎస్ఎఫ్ లో ఫుట్ బాల్ క్రీడాకారుడు, జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బీరెన్ సింగ్ 2017 లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. తన రాజకీయ జీవితంలో అనేక రాజకీయ తుఫాన్ లను తట్టుకున్నాడు.
2023 లో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్ కు వెళ్లకుండా వేలది మంది ఆయన మద్దతుదారులు, ఎక్కువగా మహిళలు ఆయనను అడ్డుకున్నారు. ఆయన మద్దతుదారులు రాజీనామా లేఖను చింపేశారు.
దీనిని ఆయన వ్యతిరేకులు దాన్నో పెద్ద డ్రామాగా అభివర్ణించారు. బీరేన్ కు ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకుని నిలబడే అద్బుతమైన నేర్పు ఉంది. ఇంతకుముందు తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన అన్ని ప్రయత్నాలను ఆయన దిగ్విజయంగా అడ్డుకున్నాడు.
డ్రగ్ కేసు..
అయితే ఆయన సవాల్ కొన్ని సంవత్సరాల క్రితం ఎదురైంది. ఓ మాదక ద్రవ్యాల వ్యాపారిని రక్షిస్తున్నాడని ఆయన పై నేరుగా ఆరోపణలు వచ్చాయి. 2018 లో మాదక ద్రవ్యాల స్వాధీనం కేసులో కీలక నిందితుడు లుఖోసేయ్ జూ పై కేసును ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారని 2020 లో అప్పటి అసిస్టెంట్ సూపరిడెంటెండ్ ఆఫ్ పోలీస్( నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ బ్యూర్) బృందా తౌనౌజమ్ ఆరోపించారు.
2019 లో ఆస్ట్రేలియ డ్రగ్ స్మగ్లర్ రెజా బోర్హానీ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. తరువాత ఆ వ్యక్తి ముంబై పోలీసులకు రూ. 1.8 కోట్ల డ్రగ్స్ తో పట్టుబడ్డారు.
బీరేన్ ఎదుగుదల..
ఆయన మొదటి పాలన కాలంలో వాక్ స్వాత్రంత్యం కూడా లేదు. నిరంకుశుడిగా ముద్ర పడ్డాడు. కనీసం ముగ్గురు జర్నలిస్టులను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బీరెన్ కూడా ఇంతకుముందు దేశ ద్రోహం కేసులో జర్నలిస్టుగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు.
ఆ అరెస్ట్ అతడికి పేరు తెచ్చిపెట్టింది. తరువాత కాలంలో రివల్యూషనరీ పీపుల్స్ పార్టీ లో చేరి రాజకీయాల్లో దూసుకుపోయాడు. 2002 లో హీన్ గాంగ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. తరువాత ఓక్రామ్ ఇబోబీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా చేరాడు. ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ..
రాజకీయ గురువు అయిన ఇబోబి సింగ్ తనను మంత్రివర్గం నుంచి పక్కకు పెట్టడంతో ఆయన కాంగ్రెస్ ను వీడి 2016 లో బీజేపీలో చేరారు. తరువాత ఒక్క సంవత్సరంలోనే సీఎం గా మారారు. అలా రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన రెండో సారి 2022 లో సీఎంగా బాద్యతలు చేపట్టిన తరువాత జాతుల కలహాలు మొదలయ్యాయి. ఈ హింసలో దాదాపు 250 మంది మరణించారు. కుకీ- జోమీ గ్రూపులకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ వర్గానికి వ్యతిరేకంగా స్వయంగా సీఎం హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అరంబై అనే మిలిషియా గ్రూపు ఆయన సృష్టించారని వారి వాదన.
ఆడియో రికార్డ్
మణిపూర్ ముఖ్యమంత్రి తో జరిగిన ఓ క్లోజ్డ్ డోర్ సమావేశంలో ఒక విజిల్ బ్లోయర్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఆడియో రికార్డుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. రాష్ట్రంలో జాతి హింసను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించారని ఈ ఆడియో రికార్డులు రుజువు చేస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఆ ఆరోపణల మధ్య గత సంవత్సరం ఒక ఆడియో టేపు బయటపడింది. అందులో బీరెన్ గొంతును పోలిన ఒక స్వరం అతను హింసను ఎలా ప్రేరేపిస్తున్నాడో వివరించడం స్పష్టంగా వినిపించింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ఖండించింది.
సుప్రీంకోర్టులో విచారణ..
ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు ఆడియోటేపుల పై సెంట్రల్ ఫోరెన్సిక్ లాబోరేటరీ నుంచి నివేదిక కొరింది. ఈ కేసు మార్చి 24న విచారణకు రానుంది. పిటిషనర్ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ తరఫు న్యాయవాదీ ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆయుధ శాల నుంచి ఆయుధాలను దోచుకోవడానికి మైతీ గ్రూపులకు తాను అనుమతించానని బీరేన్ వీడియోలో చెప్పడం వినవచ్చని అన్నారు.
అయితే ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆయనకు బీజేపీ నాయకత్వం మద్దతు లభించింది. కానీ ఈ సారి తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంది. నాయకత్వం మార్పు కోసం అసమ్మతివాదులు తమ డిమాండ్ తో ధృడంగా ఉన్నారు.