నాగాలాండ్ మున్సిపల్ ఎన్నికల్లో నూతన అధ్యాయం:అత్యధిక సంఖ్యలో మహిళల పోటీ
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో నేటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి అనేక వ్యాజ్యాల అనంతరం ఈ ఎన్నికల్లో మహిళలు బరిలో..
By : Praveen Chepyala
Update: 2024-06-26 08:21 GMT
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో తొలిసారిగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 26 నుంచే ఈ ఎన్నికలు ప్రారంభం. అయితే తొలిసారిగా ఇక్కడ మహిళల కోటాతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ చర్య రాష్ట్ర ఎన్నికల్లో పురుషుల రాజకీయ గుత్తాధిపత్య దృశ్యాన్ని మొత్తంగా మారుస్తుందని భావిస్తున్నారు.
మూడు మునిసిపల్ కౌన్సిల్‌లు - దిమాపూర్, కోహిమా, మోకోక్‌చుంగ్ లోని 36 టౌన్ కౌన్సిల్‌లు 20 సంవత్సరాల సుదీర్ఘకాలం, ఎన్నో వ్యాజ్యాల తరువాత ఇవి జరుగుతున్నాయి. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఈశాన్య రాష్ట్రాల్లోని స్థానిక గిరిజన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ప్రతిష్టంభన ఏర్పడింది.
2017లో నాగాలాండ్ ప్రభుత్వం 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలను నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు రాష్ట్రంలో తీవ్రంగా ప్రతిఘటన ప్రారంభమైంది. ఇది తరువాత హింసాత్మకంగా మారింది. పోలింగ్ ముందురోజు చెలరేగిన హింసాకాండలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
కోహిమా మున్సిపల్ కౌన్సిల్ భవనంతో సహా ప్రభుత్వ కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. వారంరోజులపాటు ఎడతెగని హింసాకాండతో అప్పటి ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఉత్సాహం..
ఈసారి ఎన్నికలకు ఒకరోజు ముందున్న మూడ్ ముఖ్యంగా మహిళల్లో అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. “నాగా మహిళల రాజకీయ సాధికారత దిశగా పౌర సంస్థల్లో మహిళా రిజర్వేషన్ గొప్ప ముందడుగు వేయనుంది. నేను ఎన్నికైనట్లయితే, నేను నా ప్రాంత అభ్యున్నతికి మాత్రమే పని చేస్తాను, నా ప్రాంతంలోని మహిళల గొంతుకగా కూడా ఉంటాను, ”అని దిమాపూర్ వార్డు నంబర్ 4 నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అపాలే థోపి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న 523 మంది అభ్యర్థుల్లో మహిళ సంఖ్య 198. తొలుత 238 మంది మహిళలు సహా 670 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 79 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా, 64 మంది పోటీ లేకుండా గెలుపొందారు, నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఇది కొత్త రికార్డు
రాష్ట్ర రాజకీయ నిర్ణయాధికార సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ ఇంతమంది మహిళలు పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా పోటీదారులు తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య ఐదుకు మించలేదు.
నాగా సంప్రదాయ పద్ధతులు, చట్టాలు మహిళలను అధికార స్థానాల నుంచి మినహాయించడమే దీనికి ప్రధాన కారణం. గ్రామ సభల వంటి సాంప్రదాయిక సంస్థలలో, మహిళలకు ప్రాతినిధ్యం లేదు, అయితే వారు కుటుంబ, సమాజ వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు, గ్రామాల మధ్య యుద్ధాలు, వివాదాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు.
మహిళా రిజర్వేషన్ నాగా సంప్రదాయ పద్ధతులకు, నాగా సంస్కృతి, ఆచారాలు, సామాజిక, మతపరమైన పద్ధతులు, భూ యాజమాన్యాన్ని రక్షించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 371A ప్రకారం రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రత్యేక నిబంధనలను ఉల్లంఘిస్తుందని గిరిజన సంఘాలు అభిప్రాయపడ్డాయి.
యూఎల్‌బీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నాగా మహిళా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని 2022లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రతిష్టంభనను అధిగమించడానికి సమావేశాలు
ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం గిరిజన సంస్థలతో వరుస సమావేశాలు, సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం 2023లో నాగాలాండ్ మునిసిపల్ చట్టాన్ని సవరించి, చైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్ కల్పించే నిబంధనను తొలగించి ఎన్నికలకు మార్గం సుగమం చేసిన తర్వాత రాజీ కుదిరింది. విశేషమేమిటంటే, నాగాలాండ్ శాసనసభకు ఇద్దరు మహిళలను గత ఏడాది మాత్రమే తొలిసారిగా ఎన్నికయ్యారు. 2022లో రాష్ట్రానికి తొలి మహిళా రాజ్యసభ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నామినీ ఫాంగ్నోన్ కొన్యాక్‌ని ఎంపిక చేసింది.
"మేము చివరకు రిజర్వేషన్‌కు అంగీకరించాము, ఎందుకంటే సమగ్ర చర్చల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ఛైర్‌పర్సన్ పదవిని రిజర్వ్ చేయకూడదని అంగీకరించినందున మా సంప్రదాయ పద్ధతులకు ఆటంకం ఉండదని స్థానిక గిరిజనులు భావించారు" అని సీనియర్ నాగా గిరిజన నాయకుడు ఇమ్టిపోకిమ్ చెప్పారు. అతను ఇటీవలి వరకు నాగా తెగల గొడుగు సంస్థ అయిన నాగా హోహో సీనియర్ సభ్యుడు, Ao నాగా సంఘం అత్యున్నత గిరిజన సంఘం Ao సెండెన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత నాగా హోహో చీఫ్ సులంతంగ్ లోథా ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు.
"పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు మహిళల్లో రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతాయని, మహిళలు, సమాజాలను ప్రభావితం చేసే సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతాయి. విధాన రూపకల్పనను ప్రభావితం చేయగల మహిళా నాయకుల ఆవిర్భావం, మొత్తం పాలన నాణ్యతను మెరుగుపరుస్తుంది. నాయకత్వ పాత్రల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది, మరింత సమానత్వ సమాజాన్ని ప్రోత్సహిస్తుంది” అని MIT- స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లోని నాగా విద్యార్థి బొమిటో వి కినిమి అన్నారు.
నూతన ఆరంభం
"మహిళలను చట్టసభల్లో చేర్చుకోవడం వల్ల వారికి రాజకీయంగా సాధికారత ఉండదు" అని ఒక ఆంగ్ల దినపత్రిక సంపాదకుడు, రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన మహిళా వాయిస్ మోనాలిసా చాంగ్‌కిజా అన్నారు.
“చారిత్రాత్మకంగా, సాధారణంగా దేశంలో నిర్ణయాధికార సంస్థల్లోని మహిళలు, మహిళా సాధికారత కోసం పెద్దగా ఏమీ చేయలేదు. కొత్తగా ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, ఏకైక రాజ్యసభ ఎంపీ ఇప్పటివరకు తమకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడంలో విఫలమయ్యారు. వారు తమ పార్టీలోని మగ నాయకులు నిర్దేశించిన పంథాలను అనుసరిస్తారు, ”అని ఆమె అన్నారు. అయితే, నాగ సమాజాన్ని మరింత కలుపుకొని పోవడానికి కనీసం ఒక కొత్త ప్రారంభం జరిగిందని ఆమె త్వరగా అన్నారు. ఆచారం, చట్టాలను మరింత కలుపుకొని పోయేలా వాటిని సంస్కరించడం తదుపరి దశ అని ఆమె తెలిపారు.