‘కరెన్సీపై పడుకుని.. పార్టీని ఇరికించాడు’
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ మిత్రపక్షానికి చెందిన సభ్యుడు ఒకరు.. కరెన్సీ నోట్లపై పడుకుని ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది
బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR)కు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)కి చెందిన ప్రముఖ సభ్యుడు బెంజమిన్ బసుమతరీకి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మిత్రపక్షం కూడా కావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బెంజమిన్ కు సంబంధించిన ఫొటోలో ఆయన రూ. 500 కరెన్సీ నోట్లపై పడుకుని ఉన్నారు.
ఇటీవల కొందరు యుపిపిఎల్ నాయకులు బోడో పీపుల్స్ ఫ్రంట్‌లోకి ఫిరాయించడంతో ఈ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి పార్టీ తరుచూ వార్తల్లో ఉంటోంది. తాజాగా మరోసారి ఆ పార్టీ సభ్యుడు కూడా ఇలా ఫొటోతో వివాదాల్లో చిక్కుకున్నాడు. దీనిపై పార్టీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన డబ్బు మీద పడుకున్న చిత్రం బయటకు రావడం పార్టీని చిక్కుళ్లో పడేసింది.
ముఖ్యంగా UPPL పార్టీ అవినీతికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రతిజ్ఞ చేయడం చేసింది. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే వాగ్దానం చేయడం కూడా మనకు తెలిసిందే. ఇదే సమయంలో ఈ ఫోటో కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.