‘‘నితీష్ ఈ సారి కింగ్ మేకర్ కాదు" | Talking Sense With Srini
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) 85 సీట్లు దక్కించుకోగా.. 89 సీట్ల గెలుచుకున్న బీజేపీ..
భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల్లో బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఒకరు. JD(U) చీఫ్ నిన్న (నవంబర్ 20వ తేదీ) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ తాజా ఎపిపోడ్‌లో ‘ది ఫెడరల్’ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్.. నితీష్ గురించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. గతంలోలోగా ఇక ముందు నితీష్ తోక ఊపడం కుదరదని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 85 సీట్లు దక్కించుకోగా.. బీజేపీ 89 సీట్ల గెలుచుకుని పట్టు నిలుపుకుంది. ఈ దఫా పూర్తికాలం బీజేపీ(BJP)తోనే కలిసి ఉండక తప్పదని, స్పీకర్ పదవితో పాటు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను దక్కించుకోవడం వెనక బీజేపీ తన బలాన్ని చాటుకుందని పేర్కొన్నారు.
ఒకప్పుడు ప్రజలు సుశాసన్ బాబుగా పిలిచే నితీష్.. 2005 తర్వాత పాలనలో సంస్కరణలు చేపట్టారు. ఫలితంగా శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. రోడ్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. " మొదటి పదేళ్లు నితీష్ స్వర్ణ యుగం" అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
ఆ తర్వాత పదేళ్లు నితీష్ పనితీరును "50–50"గా అభివర్ణించారు శ్రీనివాసన్. ‘‘అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. వ్యక్తిగతంగా అతనిపై కాకపోయినా.. అతని చుట్టూ ఉన్నవారిలో’’ అని పేర్కొన్నారు.
పెరిగిన ఆర్థిక భారం..
ఆ తర్వాత పదవీకాలంలో నితీష్‌కు ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఎన్నికల హామీలకు సుమారు రూ. 7 ట్రిలియన్లు అవసరమని అంచనా. రాష్ట్రం FRBM పరిమితులనూ దాటేసింది. మరో పెద్ద ఆర్థిక భారం..ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి రూ.1, 90వేలు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. "ఇలాంటి హామీ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి బీహార్‌లోనూ ఎదురుకావచ్చు" అని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
‘‘నితీష్ ఇకపై కింగ్ మేకర్ కాదు"
బీజేపీ సంఖ్యాపరంగా, రాజకీయంగా ఆధిపత్యం చెలాయించే స్థానాలను దక్కించుకుంది. దీంతో జేడీ(యూ) ఎత్తులు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. "నితీష్ ఇకపై కింగ్ మేకర్ కాదు" అని పేర్కొన్నారు. నితీష్ రాజకీయ జీవితంలో చివరి దశను చేరుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. "రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. రాజకీయ భవితవ్యం ఆయన శారీరక శక్తి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు శ్రీనివాసన్.