రాజధాని రైతులకు మంత్రి నారాయణ అభయం
ప్రతిరోజూ 30 నుంచి 40 రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించారు. సిటీఐఎస్ (CITIIS) ప్రాజెక్టు కింద నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), పాఠశాలల భవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనే సిటీఐఎస్ ప్రాజెక్టు ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో ఇప్పటివరకు 15 అంగన్‌వాడీ భవనాలు, 14 PHC భవనాలు, 14 పాఠశాలలు, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయిందని, ఈ సదుపాయాల ద్వారా రాజధాని పరిధిలోని గ్రామాల్లో నాణ్యమైన విద్యా, వైద్య సేవలు స్థానికులకు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 69,421 మంది లబ్ధిదార రైతులకు 61,433 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే బాకీ ఉందని చెప్పారు. ప్రతిరోజూ 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో, గత 21 రోజుల్లోనే 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని ఆయన వివరించారు. అంతేకాకుండా ప్లాట్ల కేటాయింపు విషయంలోనూ మంత్రి నారాయణ శుభవార్త అందించారు. మొత్తం 30,635 మంది రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటివరకు 29,644 మందికి కేటాయింపు పూర్తయిందని, కేవలం 991 మంది రైతులకు మాత్రమే కేటాయింపులు మిగిలి ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అవి కూడా పూర్తి అవుతాయన్నారు.
రాజధాని ప్రాంతంలో మౌళిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. కొందరు రైతులు తమకు కావలసిన ప్రాంతంలోనే ప్లాట్లు కావాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెడుతున్న నేపథ్యంలో, రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదని, ఏ సమస్యైనా తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనవసర ఆందోళన చేయొద్దని, ఓపిక పట్టాలని రైతులకు ఆయన సూచించారు.