‘ఆరోపణలు కాదు.. ఆత్మపరిశీలన చేసుకోండి’

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.;

Update: 2025-02-04 09:12 GMT

లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (CM Devendra Fadnavis) తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా.. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి సుమారు 70 లక్షల మందిని కొత్త ఓటర్లు జాబితాలో చేర్చారని రాహుల్ అన్నారు.

‘‘మహారాష్ట్ర ఎన్నికలపై కొన్ని గణాంకాలను సభ దృష్టికి తేవాలనుకుంటున్నాను. లోక్‌సభ(Loksabha) ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ జనాభాకు సమానంగా 70 లక్షల మందిని కొత్త ఓటర్లుగా చేర్చారు. ఐదు నెలల్లో మహారాష్ట్రలో కొత్త ఓటర్ల సంఖ్య, గత ఐదేళ్లలో నమోదైనదానికంటే చాలా ఎక్కువ," అని రాహుల్ అన్నారు.

"ఆత్మపరిశీలన చేసుకోండి, మహారాష్ట్రను అవమానించకండి!"

రాహుల్ వ్యాఖ్యలపై సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫడ్నవిస్ ఇలా స్పందించారు. "మీ పార్టీ ఓడిపోయిందని ప్రజా తీర్పును ప్రశ్నించొద్దు. ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోండి.. మహారాష్ట్ర ప్రజలను, ఛత్రపతి శివాజీ మహారాజ్, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే, వీర్ సావర్కర్‌ లాంటి మహానుభావులకు జన్మనిచ్చిన భూమిని అవమానించకండి." అని పేర్కొన్నారు.

"అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా.. నిజాలు తెలుసుకోండి. ఆత్మపరిశీలన చేసుకోండి.. మహారాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు (రాహుల్ గాంధీ) వాళ్లకు బహిరంగ క్షమాపణ చెప్పండి!" అని ఫడ్నవిస్ డిమాండ్ చేశారు.

గతంలో కూడా..

గత నెలలో కూడా ఎన్నికల వ్యవస్థపై సందేహం వ్యక్తం చేసిన రాహుల్.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అవసరమని, ఆ దిశగా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. "మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో తప్పు జరిగింది. కాంగ్రెస్, ప్రతిపక్షాలు మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఓటర్ల జాబితాను కోరుతున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ వాటిని అందించేందుకు నిరాకరిస్తోంది," అని రాహుల్ ఆరోపించారు.

Tags:    

Similar News