నా కులం చూసి ఓటు వేయద్దు: ప్రచారం చేసి గెలిచిన నాయకుడెవరో తెలుసా ?
నా కులం చూసి ఓటు వేయద్దన్నాడు. ప్రత్యర్థి ధనవంతుడు కార్లలో తిరిగి ప్రచారం చేస్తే..కాలి నడకతో ప్రచారం చేశాడు. ప్రచారానికి ప్రజల నుంచి విరాళాలు తీసుకున్నాడు.
By : Praveen Chepyala
Update: 2024-05-14 11:50 GMT
దేశంలో ఇప్పటి రాజకీయాలు, నాయకులు ఎలా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా వీళ్ల గురించి ఊహించగలమా? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులకు పూర్తి వ్యతిరేకంగా ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేశారు.
అయనను అందరూ దక్షిణాది రామ్ మనోహార్ లోహియాగా పిలిచేవారు. అతను కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేవారు.తన కులాన్ని చూసి ఓటు వేయెద్దని ప్రజలను ప్రచారం నిర్వహించే వాడు. ఆయనే శాంతవేరి గోపాల గౌడ.
ఆయన నిజాయితీ, రాజకీయ ఆదర్శాలు, పేదల పట్ల కనబరిచిన నిబద్ధతతో ఇప్పటికి గౌరవించబడుతుంటారు. ఎన్నికలలో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే నాయకులతో కర్ణాటకలో రాజకీయాలు కునారిల్లుతున్న తరుణంలో, అనేక మంది రాజకీయ నాయకులు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి.
ప్రజా ఫండింగ్
ఆ కాలంలో క్రౌడ్ ఫండింగ్ అనేది తెలియని భావన. కానీ 1952లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికవ్వాలని గోపాల గౌడ అనుకున్నప్పుడు ఆయన తీవ్ర పేదరికంతో పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి "ఒకే ఓటు ఒకే నోటు" అనే నినాదంతో నిధులు సేకరించారు. 1957లో భూస్వామ్య ప్రభువులు అతనిని ఓడించడానికి ముఠాగా ఏర్పడినప్పటికీ, గోపాల గౌడ 1962, 1967లో భారీ మెజారిటీతో తిరిగి సభలో అడుగుపెట్టాడు.
రాజకీయ రాబిన్ హుడ్
స్థానిక సంస్కృతిని బాగా అర్థం చేసుకుని, గౌరవించిన ఫైర్‌బ్రాండ్ రాజకీయ నాయకుడు, ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే. ఈ బక్కపలుచని వ్యక్తి ఒక గ్రామస్థుడు కావడం మరో విశేషం. అందువల్లే ఆయన వ్యవసాయ సమాజంలో భారీగా అభిమానులు, అనుచరులను సంపాదించాడు. అందుకే అతను రాజకీయ రాబిన్ హుడ్‌గా కనిపించాడు. "తన కులం చూసి ఓటు వేయవద్దని ఎప్పుడూ చెప్పే గోపాల గౌడ, 1952లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికైనప్పుడు రూ. 5,000 ఖర్చు చేశాడు" అని డాక్టర్ నటరాజ్ హులియార్ తన జీవిత చరిత్రలో చెప్పారు.
ఆరోగ్యం బాగోలేదు
గోపాలగౌడ అనుచరుడు కోనందూరు లింగప్ప 1972లో తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. “ప్రతి సభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రజల నుండి విరాళాలు సేకరించడానికి నేను తువ్వాలు విప్పాను. మొత్తం రూ.8,300 వసూలు చేశాను. ఖర్చు రూ. 5,000 కాగా, మిగిలిన మొత్తాన్ని గోపాల గౌడ వైద్య ఖర్చులకే వెచ్చించాం’’ అని లింగప్ప దివంగత సోషలిస్టు అనుభవజ్ఞుడి సంపుటిలో పేర్కొన్నట్లు తెలిసింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో..
గోపాలగౌడ హైస్కూల్‌లో ఉన్నప్పుడు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. మహాత్మా గాంధీ ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరాడు. ఆ సమయంలో డాక్టర్ విశ్వనాథరావు గోపాల గౌడకు సోషలిజానికి పరిచయం చేశారు. గోపాల గౌడ జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు ఆకర్షితుడయ్యాడు. 1948లో సోషలిస్టు పార్టీ ఏర్పడినప్పుడు మైసూరు రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు.
కాగోడు సత్యాగ్రహం
రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉద్యమమే కాగోడు సత్యాగ్రహం, ఇది తరువాత ఈ ఆందోళన రాజకీయాలకు దారితీసింది. దీంతో గోపాల గౌడ జైలు పాలయ్యాడు. గోపాల గౌడ 1952లో శివమొగ్గ జిల్లాలోని సాగర్-హోసానగర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఎన్నికల పోరు
గోపాల గౌడపై సంపుటికి సంపాదకత్వం వహించిన జి.వి.ఆనందమూర్తి ప్రకారం, 1952 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ధనవంతుడు, భూస్వామి నాయకుడు అయిన ఎఆర్ బదరీనారాయణ్ ను నిలబెట్టింది. ఆయన వాహనాల్లో ప్రచారం నిర్వహించేవారు. అయితే గోపాల గౌడ పేదవాడు. తన నియోజకవర్గమంతా నడుచుకుంటూ వెళ్లి ప్రతి ఓటర్ ను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించాడు. ఫలితంగా ఆయన భారీ మెజార్టీతో గెలిచాడు.
ఈ యువ శాసనసభ్యుడు అసెంబ్లీని దద్దరిల్లేలా చేశారు. ఉలువవనే హొళదోదెయా (రైతుకు భూమి) అనే నినాదం తొలిసారిగా అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. కర్ణాటక సమైక్యత కోసం పోరాడి సోషలిజం పరిణామానికి దోహదపడ్డారు. కన్నడ మేధావులు గోపాల్ గౌడను మేధావి రాజకీయ నేతగా చూసేవారు. 1967 నాటికి కర్ణాటక అసెంబ్లీలో ఆరుగురు సోషలిస్టు శాసనసభ్యులు ఉన్నారు.
సాహిత్య ఉద్యమం
గోపాల్‌గౌడ పుస్తకాలను ఇష్టంగా చదివేవాడు. ఆయనకు సాహిత్య అభిలాష ఎక్కువ. యుఆర్ అనంతమూర్తి, పి లంకేష్, పూర్ణచంద్ర తేజస్వితో సహా ఒక తరానికి చెందిన ప్రముఖ రచయితలు గోపాల్ గౌడను ఆరాధించారు. కన్నడ రచయితలతో నాణ్యమైన సమయాన్ని గడిపారు. నిజానికి, కన్నడ నవ సాహిత్య ఉద్యమం గోపాల గౌడ రచయితలతో సామీప్యత కారణంగా సామ్యవాద కోణాన్ని పొందింది. కన్నడ ప్రఖ్యాత కవి గోపాలకృష్ణ అడిగ “శాంతవేరియ అశాంత శాంత” - ఒక దీర్ఘ కవిత, గోపాల గౌడ వ్యక్తిగత ప్రజా జీవితానికి నివాళి.
మాస్టర్ స్పీకర్
కన్నడ కవి పు టి నరసింహాచార్ ప్రకారం, “నేను గోపాల గౌడ ద్వారా సామాజిక న్యాయం మీద ఆయన ప్రసంగంలో చదివే కవితలను వినడానికి శాసనసభను సందర్శించేవాడిని. ఆయన అసాధారణ వక్త. ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా అందరూ ఆయనకు అంతరాయం కలిగించకుండా వినేవారు. కవిత్వం, ఇతిహాసాలు, వచనాలను ఉదహరిస్తూ గోపాల్ మాట్లాడుతుంటే వినడం ఒక ఆహ్లాదకరమైన అనుభవమని రాసుకున్నారు.
శాశ్వత నివాళులు
"గోపాల్ గౌడ... ఎన్నికల అనేది అధికారాన్ని నాయకత్వాన్ని తీసుకోవడానికి ఒక మాధ్యమం కాదని, ప్రజల సార్వత్రిక సంకల్ప శక్తిని వ్యక్తీకరించడానికి ఉపయోగించే వ్యవస్థ అని బలంగా విశ్వసించారు. ఆయన ఒక అరుదైన ఆదర్శవాది. గోపాల్ గౌడ చిన్నవయసులోనే మరణించడంతో కర్ణాటకలో సోషలిస్టు ఉద్యమం నెమ్మదిగా క్షీణించింది” అని డాక్టర్ హులియార్ వివరించారు. గోపాల గౌడ తన 49 ఏళ్ల వయస్సులో 1972 జూన్ లో మరణించారు.
రచయిత జి.వి.ఆనందమూర్తి ఇలా అన్నారు.. "గోపాల గౌడ త్యాగం, కర్ణాటకకు చేసిన కృషి కారణంగా, అతను ఇప్పటికీ స్మరించబడుతుంటాడు ... (అతను) రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ప్రవర్తించాలి అనేదానికి గోపాల గౌడ ఒక ఆదర్శం "