ఉపరాష్ట్రపతి పదవికి భారత కూటమి తరుపున నామినేషన్ వేసిన సుదర్శన్ రెడ్డి

NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్‌పై పోటీ చేయనున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి - సెప్టెంబర్ 9న ఎన్నిక. మెజార్టీ మార్కు 391.;

Update: 2025-08-21 07:52 GMT

ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికకు ప్రతిపక్ష I.N.D.I.A కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి (Sudershan Reddy) గురువారం నామినేషన్ వేశారు. ఆయన వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఉన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ఎన్సీపీ-ఎస్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కూటమికి చెందిన పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరుపున సీపీ రాధాకృష్ణన్ ఆగస్టు 20న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో సెప్టెంబర్‌ 9న ఉప-రాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ సంఖ్య 781 కాగా మెజార్టీ మార్కు 391. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.


సుదర్శన్ రెడ్డి గురించి క్లుప్తంగా..

జూలై 8, 1946న జన్మించిన బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం. డిసెంబర్ 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. 1988 - 1990 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, 1990లో కేంద్రం తరపున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా కొంతకాలం పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. మే 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత డిసెంబర్ 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 12, 2007న, ఆయన భారత సుప్రీంకోర్టు(Supreme court) న్యాయమూర్తిగా నియమితులయ్యారు, జూలై 8, 2011న పదవీ విరమణ చేసే వరకు సేవలందించారు. పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్త ఛైర్మన్‌గా పనిచేశారు. 

Tags:    

Similar News