‘‘అభి అస్లీ పిక్చర్ బాకీ హై’’ అంటే ఇదేనా: ఖర్గే

రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం..

Update: 2024-07-01 11:58 GMT

రాజ్యసభలో విపక్ష నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని తనదైన శైలిలో తూర్పార పట్టారు. తన గత పది ఏళ్ల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే అని, చిత్రం అభి బాకీ హై అని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. మోదీ 3.0 పాలన పేపర్ లీక్, ఉగ్రవాద దాడులు, రైల్వే ప్రమాదాలతో ప్రారంభం అయిందని ఎద్దేవా చేశారు. విమానాశ్రయాల పై కప్పు కూలిపోవడం, వంతెనల గుహాలు కుంగడం, టోల్ చార్జీల పెంపు వంటివి చోటు చేసుకున్నాయని విమర్శలు గుప్పించారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చాలాసార్లు "పిచ్లే దస్ సాల్ తో బాస్ ట్రైలర్ థా, అభి అస్లీ పిక్చర్ బాకీ హై" అని అన్నారు. "(గత పదేళ్లు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు చిత్రం ఇంకా రాలేదు). "ప్రధాని చిత్రం ఎలా ఉంటుందో, గత నెలలో ఊహించగలిగాము" అని ఖర్గే చమత్కరించారు.
పరీక్ష పేపర్ లీక్
పరీక్ష పేపర్ లీక్‌లు, అనేక పరీక్షల రద్దు, రైలు ప్రమాదం, జమ్మూ & కాశ్మీర్‌లో మూడు ఉగ్రదాడులు, రామమందిరం లీకేజీలు, మూడు విమానాశ్రయాల్లో పై కప్పులు కూలిపోవడం, టోల్‌ ట్యాక్స్‌లు పెంపు వంటి తదితర ఘటనలు చోటుచేసుకున్నాయని ఖర్గే ఇటీవల జరిగిన అనేక సంఘటనలను ప్రస్తావించారు. ఇటీవల పేపర్ లీకేజీల కారణంగా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి ఇలాగే కొనసాగితే విద్యార్థుల చదువు ఆగిపోతుందని గత ఏడేళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, దీంతో 2 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడిందని ఖర్గే అన్నారు. ఎగువ సభలో ప్రతిపక్ష నాయకుడు (LoP) ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విషయంపై ఏమీ చేయడం లేదని, పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. దేశంలో పరీక్షా విధానాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రపతి ప్రసంగం
గతవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రసంగంలో మణిపూర్ పరిస్థితి గురించి ప్రస్తావించలేదన్నారు. గత ఏడాది కాలంగా మండుతున్న మణిపూర్‌లో ప్రధాని పర్యటించలేదని ఖర్గే అన్నారు.
పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో దార్శనికత, దిశానిర్దేశం లేదని, కేవలం నినాదాలు మాత్రమే ఇస్తున్నారని, అభివృద్ధి పనులు చేయడం లేదని అధికార పక్షంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రపతి ప్రసంగం కూడా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను విస్మరించిందని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఖర్గే అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో పేదలు, దళితులు, మైనార్టీల ప్రస్తావన లేదన్నారు.
సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నం
ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రతిపక్షాలు సామాన్యుల కష్టాలపై మాట్లాడుతున్నాయని, మోదీ మాత్రం ‘మన్‌కీ బాత్‌’ మాత్రమే చేస్తున్నారన్నారు. కేవలం నినాదాలు చేయడంలో మోదీ నిపుణుడని ఖర్గే అన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రసంగాల ద్వారా సమాజాన్ని విభజించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంతకు ముందు ఏ ప్రధాని కూడా ఇలా చేయలేదన్నారు.
కర్నాటక, మధ్యప్రదేశ్‌లతో సహా అనేక ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు జైలు పాలవుతుండగా, వాటిని తొలగించారని, ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, ఇతర నాయకుల విగ్రహాలను పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అసలు స్థలాల్లో తిరిగి ఉంచాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News