గ్యాంగ్ రేప్‌పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా ఎలా స్పందించారు?

‘‘విద్యార్థినులు రాత్రివేళ బయటకు వెళ్లడం మంచిది కాదు.. కాలేజీలు కూడా అందుకు అంగీకరించకూడదు’’ - TMC చీఫ్

Update: 2025-10-12 10:55 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) సామూహిక అత్యాచార ఘటన (Gang Rape)పై స్పందించారు. నిందితులెవర్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మిగతా వారికోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు.

బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ సెకండీయర్ విద్యార్థినిపై శుక్రవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది. తన స్నేహితుడితో కలిసి రాత్రి సమయంలో కాలేజీ నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

‘రాత్రిళ్లు బయటకు పంపొద్దు..’

"మెడికోపై గ్యాంగ్ రేప్ ఘటన బాధాకరం. సాధ్యమయినంత వరకు విద్యార్థినులు రాత్రిపూట బయటకు వెళ్లకపోవడం మంచిది. వాళ్లను వెళ్లనివ్వకుండా కాలేజీ యాజమాన్యాలు కూడా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో ఘటన జరిగిందని తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగతా వారి కోసం అన్వేషిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు సీఎం మమతా బెనర్జీ.

గతంలో ఒకటి రెండునెలల్లోపే ఛార్జ్-షీట్ వేశామని, దిగువ కోర్టు నిందితులను ఉరితీయాలని ఆదేశించిన విషయాన్ని మమతా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రైవేటు కాలేజీ గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని చెబుతూనే ఈ ఘటనకు ప్రభుత్వంతో ముడిపెట్టడం భావ్యం కాదని ప్రతిపక్షాలను విమర్శించారు.

ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి ఘటనలను ఉదహరిస్తూ.. ‘‘దాదాపు నెల క్రితం ఒడిశాలోని పూరి బీచ్‌లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మరి ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంది?” అని ప్రశ్నించారు టీఎంసీ చీఫ్ మమత. మణిపూర్, యూపీ బీహార్, ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరిగాయని అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


అసలేం జరిగింది?

బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండీయర్ చదువుతున్న అమ్మాయి.. తన స్నేహితుడితో కలిసి అక్టోబర్ 10వ తేదీ రాత్రి బయటకు వెళ్లింది. ఆసుపత్రి భవనం వెనుక ఉన్న ప్రాంతంలో కొంతమంది ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

Tags:    

Similar News