కొత్త GST విధానంపై అమిత్ షా ఎలా స్పందించారు?
‘‘నిత్యావసరాలు, హెల్త్‌కేర్ ప్రాడక్ట్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గడం ద్వారా మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుంది’’ - కేంద్ర హోం మంత్రి
కొత్త GST విధానాన్ని "విశ్వాస ఆధారిత పన్ను వ్యవస్థ"గా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో (Amit shah) షా మాట్లాడుతూ.. GSTలో కొత్త సంస్కరణలతో నిత్యావసరాల ధరలు తగ్గాయన్నారు. విద్యుత్, సిమెంట్, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలు సరళీకృతమయ్యాయని పేర్కొ్న్నారు. "చరిత్రలో ఇది ఒక మైలురాయి. ప్రజలు వెంటనే దీని ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు. మోదీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుతుందని విశ్వసిస్తున్నా" అని చెప్పారు.
సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ విధానం.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి కాదని, ప్రజలపై భారాన్ని తగ్గేంచేందుకేనని షా స్పష్టం చేశారు. “ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పన్ను ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి కాదు. దేశాన్ని నడపడానికి అని జనం గుర్తిస్తారు" అని పేర్కొన్నారు అమిత్ షా.
జీఎస్టీ వసూళ్లు రూ.80వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగాయని చెబుతూ.."జీఎస్టీతో ప్రజలకు ఉపశమనం కలిగించే సమయం ఆసన్నమైంది. వసూళ్లు పెరిగాయి. తక్కువ ఖర్చుల వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారు" అని షా చెప్పారు.
జీఎస్టీ విమర్శకులను టార్గెట్ చేస్తూ..ప్రతిపక్షాలు మొదట జీఎస్టీని "Waste Tax"గా అన్న ప్రతిపక్షాలు.. ఆ తర్వాత దాన్ని తమ సొంత ఆలోచనగా చెప్పుకోవడంపై షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, పి చిదంబరం లాంటి మహా నాయకులు అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, అయితే ప్రధాని మోదీ నాలుగేళ్లలోపే అమలు చేసి చూపించారని చెప్పారు.
నిత్యావసరాలు, హెల్త్‌కేర్ ప్రాడక్ట్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గించడం ద్వారా మధ్యతరగతి ఆదాయాలను పెంచుతాయి అని షా పునరుద్ఘాటించారు.