గుజరాత్‌లో కూడా 'హిందీని రుద్దారు'..

‘హిందీని బీజేపీ ప్రోత్సహించడం.. భాష సంబంధిత అంశం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే’ - గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హేమాంక్ కుమార్ షా;

Update: 2025-03-06 08:05 GMT

13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని బహిరంగ సభల్లో మోదీ కేవలం గుజరాతీలోనే మాట్లాడారు. కానీ 2014 తర్వాత పూర్తిగా హిందీలోకి మారిపోయారు. అప్పటి నుంచి హిందీకి పెద్ద ప్రోత్సాహం లభిస్తోంది. బీజేపీ హిందీ ప్రచారం దక్షిణ రాష్ట్రాలకే పరిమితమైందనిపించొచ్చు. కాని దాన్ని తమిళనాడు తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే కానీ నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనే మౌనంగా కొనసాగడానికి ప్రధాన కారణం మోదీయేనని అనిపిస్తోంది.

భాష మార్చిన మోదీ..

2023లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉత్తర, మధ్య, సౌరాష్ట్ర గుజరాత్ గ్రామాల్లో నిర్వహించిన ఆరు బహిరంగ సభల్లో మోదీ (Narendra Modi) హిందీలోనే మాట్లాడారు. ప్రత్యేక ఉద్దేశంతో కొన్నిసార్లు మాత్రమే గుజరాతీలో కొన్ని మాటలు పలికారు. ఇదే తీరు 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించింది. ఆ సమయంలో కూడా మోదీ ఎక్కువగా హిందీలోనే ప్రసంగించారు. కానీ 2014కి ముందు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. గుజరాత్ సీఎంగా ఉన్న 13 ఏళ్లలో మోదీ అన్ని బహిరంగ సభల్లో గుజరాతీయే మాట్లాడేవారు. ఆయన తన మాతృభాషను "గుజరాతీ అస్మిత" (గుజరాతీ గౌరవం)గా కొనియాడేవారు.

గుజరాత్‌లో హిందీ 'విధింపు'..

హిందీని బీజేపీ ప్రోత్సహించడం.. భాష సంబంధిత అంశం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమేనని గుజరాత్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ హేమాంక్ కుమార్ షా అభిప్రాయపడ్డారు. "గుజరాత్‌లో హిందీలో రాజకీయ ప్రసంగాలు కొత్త కాదు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కూడా గుజరాత్‌ పర్యటనలో హిందీ మాట్లాడేవారు. కానీ బీజేపీ దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే సమస్య," అని షా పేర్కొన్నారు.

గుజరాత్ విద్యాపీఠ్‌లోనూ హిందీ భాషే మట్లాడతారు. ఇది గుజరాతీ భాష, సాహిత్యం, స్థానిక ఉపభాషలపై పరిశోధన చేసే కేంద్రంగా ఉండాల్సి ఉన్నా.. 2016లో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాతీ పరిశోధన నిధులను మళ్లించారని షా వెల్లడించారు.

గుజరాతీ భాషపై ప్రభావం..

2019లో మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో పాడే భజన పాటలు హిందీలోనే ఉండాలని, దీన్ని కొంత మంది అధ్యాపకులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని షా వివరించారు. 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన విద్యా సదస్సులో హిందీకి మరింత ప్రోత్సాహం లభించింది. "సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉపాధ్యాయులకు హిందీ, సంస్కృతాన్ని ప్రోత్సహించాలని సూచనలు కూడా చేశారు," అని షా తెలిపారు.

మూడు భాషల విధానం..

2014 వరకు గుజరాత్‌లో గుజరాతీ, ఇంగ్లీష్ అధికార భాషలు. అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఈ రెండు భాషల్లోనే వెలువడేవి. కానీ 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ ఏడాది గుజరాత్‌లో తొలిసారి "హిందీ దివస్ సమారోహ్", "అఖిల భారతీయ రాజ్‌భాష సమ్మేళన్" నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అమిత్ షా అధ్యక్షత వహించి.. "హిందీ గుజరాతీకి సహోదరి భాష" అని వ్యాఖ్యానించారు.

దీని తర్వాత రాష్ట్రంలోని సివిల్ సర్వెంట్లు, మంత్రులు సామాజిక మాధ్యమాల్లో హిందీ వాడాలని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మూడు భాషల విధానాన్ని అవలంబించింది. హిందీ లేదా సంస్కృతం నేర్చుకోవడం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసింది.

హిందీకి ప్రోత్సాహం..

2016 నాటికి గుజరాత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు హిందీ (Hindi imposition) నేర్పే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బ్యాంకుల్లో రోజూ బోర్డులపై హిందీ పదాలను వాటి గుజరాతీ అర్థాలతో రాసేవారు.

"2014 తర్వాత హిందీని ప్రోత్సహించడం మొదలైంది," అని గుజరాత్‌కు చెందిన రచయిత, సమాజ శాస్త్రవేత్త ఇంద్ర హిర్వే పేర్కొన్నారు. "ఇది వ్యవస్థీకృతంగా అమలైనా.. హిందీని ప్రధానంగా నగరాల్లో మాత్రమే మాట్లాడుతున్నారు," అని ఆమె చెప్పారు.

2014 తర్వాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అహ్మదాబాద్, వడోదర వంటి ప్రధాన నగరాల్లోని బీజేపీ నాయకులు హిందీ నేర్చుకుని మాట్లాడాలని సూచనలు అందాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో తొలిసారిగా హిందీ ప్రాధాన్యం మరింత పెరిగింది. 2014 తర్వాత అధికారిక ఉత్తర్వులు గుజరాతీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఇవ్వడం మొదలైంది.

హిందీపై చట్టపరమైన వివాదం..

2011 జనగణన తరువాత, గుజరాతీల హిందీ నైపుణ్యం ఎంత మేరకు మెరుగుపడిందో స్పష్టంగా తెలియదు. కానీ 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో కేవలం 8% మంది గుజరాతీలు మాత్రమే హిందీ మాట్లాడగలిగారు.

అంతేకాదు 2012లో గుజరాత్ రైతుల బృందం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను (NHAI) కోర్టులోకి తీసుకెళ్లింది. కారణం? భూమి స్వాధీనం కోసం హిందీలో నోటిఫికేషన్ ఇవ్వబడడం. దీనిని రైతులు చదవలేకపోయారు. గుజరాత్ హైకోర్టు హిందీ నోటిఫికేషన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉత్తర్వులను గుజరాతీ, హిందీలో ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

గుజరాత్‌లో భాషలపై సహనం..

"1960లో ద్విభాషా బాంబే రాష్ట్రం నుంచి వేరు గుజరాత్(Gujarat) వేరుపడింది. కానీ మహారాష్ట్ర లాగా గుజరాతీలో మాత్రమే మాట్లాడాలనే డిమాండ్ ఎప్పుడూ లేదు," అని ఆమె పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి చీమన్‌భాయ్ పటేల్ తన మంత్రులతో గుజరాతీలో అధికారులతో ఇంగ్లీష్‌లో మాట్లాడేవారని హిర్వే వివరించారు. 1980లో గుజరాత్‌లో టెక్స్‌టైల్ పరిశ్రమ ఊపందుకున్న సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు వచ్చారు. వారి భాషలకు గుజరాత్ స్వేచ్ఛనిచ్చింది. "అందుకే బీజేపీ హిందీని ప్రోత్సహించినా ప్రతిఘటన ఎదురుకాలేదు," అని హిర్వే అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News