సుప్రీం ఆదేశాలతో ఆధార్‌కు గ్రీన్ సిగ్నల్..
ఓటరు గుర్తింపు కార్డుగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం;
ఓటరుగా గుర్తించేందుకు ఆధార్ కార్డు(Aadhar)ను ప్రామాణికంగా తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme court) కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ మంగళవారం (సెప్టెంబర్ 9) బీహార్(Bihar) ఎన్నికల యంత్రాంగానికి లేఖ రాసింది. ఆధార్ కార్డును ఓటరు అదనపు గుర్తింపు పత్రంగా పరిగణించాలని అందులో పేర్కొంది. "జాబితాలో ఉంచిన 11 పత్రాలతో పాటు ఆధార్ కార్డును 12వ పత్రంగా పరిగణించాలని’’ లేఖలో పేర్కొంది. అందులోనే ఆధార్‌ను అంగీకరించకపోయినా లేదా తిరస్కరించినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ప్రక్రియలో ఆధార్ కార్డును వెంటనే పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం ఎన్నికల సంఘాన్ని కోరింది.
SIRతో 65 లక్షల పేర్లు తొలగింపు..
బీహార్(Bihar)లో ఎన్నికల కమిషన్(EC) చేపట్టిన ఓటరు జాబితా సవరణ(SIR)పై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియపై స్టే విధించాలని కొంతమంది ఎంపీలు సుప్రీంకోర్టు(Supreme court)లో పిటీషన్లు కూడా దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం SIR చేపట్టి వివిధ కారణాలతో సుమారు 65 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. బీహార్‌లో జరుగుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. 52 లక్షలకు పైగా ఓటర్లు తమ చిరునామాలలో లేరని, మరో 13 లక్షల మంది చనిపోయారని ఎన్నికల సిబ్బంది గుర్తించారు. మొత్తం 7.9 కోట్ల నమోదిత ఓటర్ల సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది.
రాహుల్ ‘ఓటర్ అధికార్ యాత్ర’’
SIRను వ్యతిరేకిస్తూ బీహార్(Bihar)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ చేపట్టిన విషయవం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ (BJP), ఎలక్షన్ కమిషన్(EC) కుమ్మకై ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR) పేరుతో ప్రతిపక్ష ఓటర్లను తొలగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
16 రోజుల పాటు 1,300 కి.మీల దూరం కొనసాగిన యాత్రలో వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (AkhileshYadav), రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) పాల్గొన్నారు.
ఏమిటీ S.I.R..
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) చేపట్టి ఓటరు లిస్టును అప్‌డేట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ భావించింది. దాని ప్రకారం 1987 తర్వాత జన్మించిన వారు ఓటరుగా నమోదు చేసుకోడానికి వారి బర్త్ సర్టిఫికేట్‌తో పాటుగా తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని భారత కూటమి(I.N.D.I.A)లోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. SIR వల్ల బీహార్‌లో 8 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 20 శాతం మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి.