కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై విచారణకు రంగం సిద్ధం
గత ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కోవిడ్ సమయంలో పరికరాలు, మందుల కొనుగోళ్లలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలొచ్చాయి.
కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్కాం వెలుగులోకి వచ్చింది. గత ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కోవిడ్ సమయంలో పరికరాలు, మందుల కొనుగోళ్లలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలొచ్చాయి. దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఆగస్టు 31న అందజేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన డిప్యూటీ డికె శివకుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. హోం మంత్రి జి పరమేశ్వర, న్యాయ మంత్రి హెచ్‌కె పాటిల్, ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రాజకీయ ప్రతీకార చర్య కాదు..
కోవిడ్ కిట్ల కొనుగోళ్లలో అవకతకలపై విచారణ జరిపి బాధ్యలపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామే తప్ప ఇది రాజకీయ కక్షగా భావించకూడదని ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావ్ అంటున్నారు.‘‘ పీపీఈ కిట్‌ల కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించారు. ఫలితంగా వారికి రూ. 14 కోట్లు అదనంగా చెల్లించారు. అవినీతి నిరోధక చట్టం కింద మాజీ సీఎం యడియూరప్ప, మాజీ మంత్రి శ్రీరాములుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇందులో ఎలాంటి ‘రాజకీయ ప్రతీకార’ ఆలోచన ప్రభుత్వానికి లేదు’’ అని చెప్పారు.