Farmers Protest | యూపీలో కొనసాగుతోన్న రైతుల ఆందోళన ..
తమ భూములను సరైన నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస ప్యాకేజి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు
ఉత్తర ప్రదేశ్‌లో రైతుల ధర్నా కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే వద్ద గుమిగూడిన రైతులు తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన విరమించేంది లేదని చెబుతున్నారు. బుధవారం నిరసనకారులను పోలీసులు వివిధ పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారు. సాయంత్రం విడుదలైన రైతులు తిరిగి నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. నిరసన స్థలం మార్పుపై కూడా గురువారం నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకులు తెలిపారు.
రైతుల ఆందోళన ( మహాపంచాయత్)కు మద్దతుగా బయల్దేరిన రైతు నాయకుడు టికాయత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అలీఘర్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల అయ్యాక ఆయన విలేఖరులతో మాట్లాడారు. గౌతమ్ బుద్ధ నగర్‌లోని “కిసాన్ పంచాయితీ” తీసుకున్న నిర్ణయాలకు నిరసన తెలుపుతున్న రైతులంతా పూర్తిగా కట్టుబడి ఉండాలని కోరారు. "రైతుల సమస్యలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నవి. అక్కడ నుంచే సమాధానం రావాలి. సుదీర్ఘ పోరాటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులు లక్నోకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని టికాయత్ తెలిపారు. మరో వైపు మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ముజఫర్‌నగర్ నుంచి బయలుదేరిన బీకేయూ-టికైత్ నాయకుడు నరేష్ టికైత్‌ను భౌన్వారా కాలా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రైతుల నిరసన ఎందుకు?
1970లో ఢిల్లీ శివార్లలో ఏర్పడిన నొయిడా (న్యూ ఓఖ్యాల ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ అథారిటీ) అంచెలంచెలుగా విస్తరిస్తూ వచ్చింది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తమ నుంచి లాక్కున్న భూములకు సరైన నష్టపరిహారం చెల్లించి, తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస ప్యాకేజి కల్పించాలని డిమాండ్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వాస్తవంగా రైతులు సోమవారం వారు “ఢిల్లీ చలో” మార్చ్‌ను ప్రారంభించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు దళిత ప్రేరణ స్థలం వద్ద ధర్నా చేశారు. మరుసటి రోజు పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. గౌతమ్‌బుద్ధ్‌నగర్ పోలీసులు వందమందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలు, వృద్ధులను అదే రోజు విడుదల చేశారు. మంగళవారం 160 మందికి పైగా రైతులను అరెస్టు చేసినట్లు రైతు నాయకుడు సునీల్ ఫౌజీ తెలిపారు.
కమిటీ ఏర్పాటు..
నోయిడా, గ్రేటర్ నోయిడాలో రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది . ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అనిల్ కుమార్ సాగర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఒక నెలలోగా ప్రభుత్వానికి నివేదిక మరియు సిఫార్సులను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కమిటీని కోరింది.