Farmers Protest | ‘ఛలో ఢిల్లీ మార్చ్’లో ఇద్దరు రైతులకు గాయాలు

పంటలకు కనీస మద్దతు ధర, పంటల రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ తదితర డిమాండ్లపై రైతులు ఛలో ఢిల్లీ మార్చ్ ప్రారంభించారు.

Update: 2024-12-06 12:17 GMT

పంటలకు కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్ల కోసం కేంద్రాన్ని నిలదీసేందుకు 101 మంది రైతులతో కూడిన 'జాతా' (సమూహం) శుక్రవారం శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించింది. మార్గం మధ్యలో ఇనుప గ్రిల్స్‌తో కూడిన భారీ సిమెంటు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వారి పాదయాత్ర కొన్ని మీటర్ల దూరంలోనే ఆగిపోయింది. సెక్షన్ 163 (ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం) అమలులో ఉన్నందున రైతులను ముందుకు వెళ్లవద్దని హర్యానా పోలీసులు కోరారు. వినకపోవడంతో నిరసన తెలుపుతున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. ఆందోళనకారుల్లో ఒకరు భద్రతా బలగాలు ఉన్న టిన్‌ పైకప్పుపైకి ఎక్కడంతో బలవంతంగా కిందకు దించారు. శంభు సరిహద్దు వద్ద వాటర్ కెనాన్ వాహనాలను మోహరించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాలలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ SMS సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది.

రైతుల డిమాండ్లేమిటి?

పంటలకు కనీస మద్దతు ధర, పంటల రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు.

Tags:    

Similar News