ఉద్ధవ్ థాకరేకు షిండే స్ట్రాంగ్ కౌంటర్ ..

గంగాలో స్నానం చేయడం ద్వారా పాపాలు పోవన్న - ఉద్ధవ్ థాకరే: బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను విస్మరించిన వారి పాపాలు తొలగాలనే స్నానమాచరించా - షిండే.;

Update: 2025-02-28 13:08 GMT

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే (Eknath Shinde) శివసేన (Shiv Sena)(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సిద్ధాంతాలను విస్మరించిన వారి పాపాలు తొలగాలని కోరుకుంటూ కుంభమేళాలో పవిత్ర స్నానం చేశానని చెప్పారు. గంగాలో స్నానం చేయడం ద్వారా మహారాష్ట్రను మోసం చేసిన పాపాలు పోవని షిండేనుద్దేశించి ఇటీవల ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు చేశారు.

సంత్ రవిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో షిండే మీడియాతో మాట్లాడారు. "నేను నా పాపాలను కడుక్కోడానికి కుంభమేళాకు వెళ్లానని ఉద్ధవ్ థాకరే అంటున్నారు. కానీ నేను ఆధ్యాత్మిక శాంతి కోసం వెళ్లాను. ఇంకా చెప్పాలంటే బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను విస్మరించిన వారి పాపాలు తొలగాలని పవిత్రస్నానం ఆచరించా. కానీ వారు మాత్రం తమ పాపాలను దాచుకునేందుకు లండన్‌ వెళ్తున్నారు. చుట్టూ జరుగుతున్న శుభ పరిణామాలను చూడలేకపోతున్నారు. వారు మమ్మల్ని మోసగాళ్లంటున్నారు. కానీ శివసేనకు చెందిన 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఓటర్లను ఏమంటారు?,’’ అని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పూర్తిగా నామరూపాల్లేకుండా పోతాయని పేర్కొన్నారు.

పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద జరిగిన అత్యాచార ఘటన గురించి మాట్లాడుతూ.. నిందితుడి కఠిన శిక్ష విధిస్తామని షిండే చెప్పారు. "అది అత్యంత దురదృష్ట ఘటన. మహిళలపై జరిగే నేరాలపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది," అని అన్నారు. ‘‘నేను ఇప్పటికే వ్యక్తిగతంగా (పూణే) పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాను. కేసును ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారిస్తాం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా కేసు పురోగతిని తెలుసుకుంటున్నారు. నిందితుడికి పడే శిక్ష ఇతరులకు గుణపాఠం అవుతుంది," అని షిండే స్పష్టం చేశారు. 

Tags:    

Similar News