అవినీతి, రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన ఆర్జీకర్ ఆస్పత్రి

పేరుకే అదో ఆస్పత్రి.. కానీ లోపలంతా ఉత్తర బెంగాల్ మాఫియాదే ఆధిపత్యం. తమ మాట కాదన్నవారికే అక్కడ ప్రత్యక్ష నరకం చూపిస్తారు. బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో..

By :  44
Update: 2024-08-19 06:44 GMT

(సమీర్ కే. పుర్కాయస్థ)

బెంగాల్ లో వైద్య విద్యార్థిని దారుణ హత్య, అత్యాచారం తరువాత ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిపోయింది. దీనిని అందరూ స్థానికంగా ఖాల్‌పార్(కందకం) అని పిలుస్తూ ఉంటారు. ఈ పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇది కోల్ కతలోని బెల్గాచియాలోని ఒక కందకం(ఖాల్) దగ్గర నెలకొని ఉండటంతో దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది కావచ్చు.

క్షీణించి పోతున్న పేరు..
ఈ ఆస్పత్రి చరిత్ర పరిశీలిస్తే కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా RGKMCH దాని మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, బెదిరింపులు కారణంగా నిజంగానే ఓ బురద గుంటగా మారిపోయింది. ఆగష్టు 9న ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య క్రమబద్ధమైన అధోగతికి పరాకాష్ట అని పూర్వ విద్యార్థి ఒకరు ఆరోపించారు. బ్రిటిష్ వలస కాలం నాటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని విమర్శించారు.
" ప్రస్తుతం బహిష్కరించబడిని ప్రిన్సిపాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న విద్యార్థి విభాగాల నుంచి, అలాగే ఇతర వైద్యుల సహాయంతో ఆస్పత్రిని తన ప్రైవేట్ సామ్రాజ్యంగా నడుపుతున్నాడు. అతని మాట వింటే పర్వాలేదు.. కాదంటే వారికి నరకం చూపిస్తాడు. ” అని నిరసన తెలిపిన డాక్టర్, RGKMCH పూర్వ విద్యార్థి డాక్టర్ సామ్ ముసాఫిర్ అన్నారు.
"ఉత్తర బెంగాల్ లాబీ"
2021లో కోవిడ్ మహమ్మారి కాలంలో డాక్టర్ ఘోష్ RGKMCH ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తృణమూల్ కాంగ్రెస్‌లోని "నార్త్ బెంగాల్ లాబీ"గా పిలువబడే ఒక నిర్దిష్ట వైద్యుల లాబీ చక్రం తిప్పింది.
ఈ లాబీకి పార్టీకి చెందిన డాక్టర్-కమ్-ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వైద్యుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ నాయకుడితో కూడిన త్రయం నియంత్రిస్తుందని పలువురు వైద్యులు, విద్యార్థులు ఫెడరల్‌కి తెలిపారు. వీరంతా తమ పేరు బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డాక్టర్ ఘోష్ తన పదవీ స్వీకారం చేసిన వెంటనే ఆస్పత్రిపై ఉత్తర బెంగాల్ లాబీ ముద్ర వేయడం ప్రారంభించారు. అప్పుడే హస్పిటల్ పై తన పట్టు సాగిస్తున్న మరో రెండు లాబీలను అక్కడి నుంచి తప్పించారు.
కార్యనిర్వహణ పద్ధతి
వచ్చి రాగానే ఈ మాఫియా ఆస్పత్రిలో తనకు వచ్చిన వ్యక్తులతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తనతో నడిచే వారికి హస్టల్ సీట్లు, బెడ్ల కేటాయింపు, డ్యూటీ రోస్టర్ లు, సిబ్బంది ఎంపిక ఇలా అన్నింటికి తమదైన ముద్ర వేసుకున్నారు. ఇలా ఆస్పత్రిని నియంత్రించడానికి ఓ ప్రణాళికబద్ధంగా వ్యవహరించారని డాక్టర్ ముసాఫిర్ ది ఫెడరల్ తో చెప్పారు.
డాక్టర్ ముసాఫిర్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, చాలా మంది జూనియర్ వైద్యులు స్థానికంగా హౌస్ సిబ్బంది నియామకం కోసం వైద్య విద్య డైరెక్టరేట్ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు మానిప్యులేటర్లకు మరింత సహాయపడేలా ఉన్నాయని ఆరోపించారు.
మార్గదర్శకాల ప్రకారం, హౌస్ స్టాఫ్ ఎంపిక "ఫైనల్ మెరిట్ స్కోర్" ఆధారంగా అకడమిక్ స్కోర్, ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్-కమ్-వైస్-ప్రిన్సిపాల్ (MSVP), అకౌంట్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ ఏర్పాటు చేసిన హౌస్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఇతరులు ఉన్నారు.
ఇది ఎంపికైన వారిని మార్చటానికి ఇంటర్వ్యూ ప్యానెల్‌కు అధికారం ఇచ్చిందని చాలా మంది ఇంటర్న్‌లు ఆరోపించారు. ఇంటర్వ్యూ ప్యానెల్ కు రెండు నెలల జీతం ఇచ్చిన వారికి మాత్రమే జాబితాలో పేరు నమోదు చేస్తున్నారని జూనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు.
RG కర్ ఆసుపత్రి ప్రస్తుతం 84 మంది హౌజ్ సర్జన్ ఎంపిక అయ్యారు. ఈ పోస్టులకు 151 మంది పోటీ పడ్డారు. వైద్యుల నుండే కాకుండా క్యాంటిన్లు, ఫుడ్ స్టాల్స్ నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రాంగణంలోనే ఎనిమిది క్యాంటీన్లు, కొన్ని అక్రమ స్టాల్స్ ఉన్నాయి.
టిప్ ఆఫ్ ఐస్ బర్గ్..
పైన చెప్పిన అక్రమాలన్నీ కూడా కొన్ని శాంపిల్లు మాత్రమే అని ఆసుపత్రి ఇంటర్న్ డాక్టర్ అనుభవ్ మండల్ పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌పై గతంలో పలు అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతనిపై గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, నేషనల్ మెడికల్ కమిషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి.
కానీ వాటిలో నిరూపితం కాలేదు. కొన్ని అదృశ్య శక్తులు అతడిని రక్షించాయి. గతంలో, డాక్టర్ ఘోష్ RGKMCH నుంచి మూడుసార్లు బదిలీ చేయబడ్డారు. ఒకానొక సందర్భంలో బదిలీ అయిన 24 గంటలలోపు తిరిగి ఇదే ఆస్పత్రిలో నియమించబడ్డారు. రాష్ట్ర పవర్ కారిడార్‌లో ఆయన ప్రభావం అలాంటిది.
ఈసారి, యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై ప్రస్తుత నిరసన నేపథ్యంలో అతను రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే, అతను ప్రమోషన్‌గా భావించిన కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌గా తిరిగి నియమించబడ్డాడు.
ఈ నిర్ణయం కలకత్తా హైకోర్టు మండిపడింది. ఉన్నత న్యాయస్థానం ఆగ్రహంతో ఆయన దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. ఇప్పుడు అత్యాచారం, హత్యపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.
అవినీతి ఆరోపణల వెల్లువ
డాక్టర్ ఘోష్ హయాంలో RGKMCH అథారిటీపై లేవనెత్తిన కొన్ని ప్రధాన ఆరోపణలలో బయో-వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో అవినీతి, మందులు, పరికరాల సేకరణ, మరణించిన వారి కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా “డిసెక్షన్ క్లాస్” కోసం శవపరీక్ష కోసం పంపిన మృతదేహాలను దుర్వినియోగం చేయడం, నిబంధనలు పాటించని వైద్యులు విద్యార్థులపై ప్రతీకారం తీర్చుకోవడం వీరు లక్ష్యంగా ఉండేది.
“గత సంవత్సరం RGKMCH కేవలం 48 కిలోల బయోవేస్ట్‌ను ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. నగరంలోని మరో ప్రధాన వైద్య సంస్థ, నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అదే సమయంలో 1.5 లక్షల కిలోల బయోవేస్ట్‌ను ఉత్పత్తి చేసింది, ”అని డాక్టర్ ముసాఫిర్ ఎత్తి చూపారు.
పైన పేర్కొన్న అవకతవకలు, మోసాలపై గత సంవత్సరం వ్రాతపూర్వక ఫిర్యాదు చేసిన ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీని ఆసుపత్రి నుంచి తొలగించారు. వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పిన పలువురు విద్యార్థులపై గతంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అలాగే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాయని, ఇంటర్న్ షిప్ లో వేధించడం విద్యార్థులను బెదరించే వారు.
రెండేళ్ల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, గతేడాది సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయిన డాక్టర్ మండల్, అధికారులపై షెడ్యూల్డ్ కమిషన్‌ను ఆశ్రయించారు. "నేను SC కమిషన్‌ను ఆశ్రయించిన తర్వాత మాత్రమే వేధింపులు తగ్గాయి" అని డాక్టర్ మండల్ ది ఫెడరల్‌తో అన్నారు.
TMC లోపల ప్రత్యర్థులు
నిరసన తెలుపుతున్న వైద్యులు, విద్యార్థులు మాత్రమే కాదు RGKMCH అథారిటీ స్థూల నిర్వహణా లోపం అని ఆరోపించారు. చాలా మంది TMC నాయకులు కూడా ప్రైవేట్‌గా, బహిరంగంగా నిర్వహణలోపం గురించి ప్రస్తావించారు. అక్రమాలపై డాక్టర్ ఘోష్, RGKMCH అధికారులపై వేళ్లు లేవనెత్తిన ఆ పార్టీ నాయకులలో TMC రాజ్యసభ ఎంపీ డాక్టర్ శాంతాను సేన్ కూడా ఉన్నారు. యాదృచ్ఛికంగా, TMC పరిధిలోని వైద్యుల లాబీకి సేన్ స్వయంగా నాయకత్వం వహిస్తాడు.
ఒక కుట్ర..
వైద్య విద్యార్థి హత్య, అత్యాచారం వెనక డాక్టర్ ఘోష్ అతని కోటరీ ప్రభావం చూపినందున, దీని వెనక భయంకరమైన కుట్ర కోణం ఉందనే అనుమానాలు ఉన్నాయి. బాధితురాలు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె తన డ్యూటీకి ఎప్పుడు వెళ్లిన చాలా భయంతో అయిష్టంగా వెళ్లేదని చెప్పారు.
దీంతో సంస్థలో జరుగుతున్న కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆమె అడ్డుగా వచ్చినందుకు కక్ష, ప్రతీకారంతో హత్యకు గురై ఉండొచ్చన్న అనుమానం మరింత పెరిగింది.
ఈ క్రూరమైన సంఘటనపై వైద్య వర్గాల్లో విపరీతమైన ఆగ్రహం చెలరేగేలా చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఈ కుట్రను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
వామపక్షాల రికార్డు
అయితే బెంగాల్ లో ఇలాంటి ఘటనలు జరగడం కొత్త కాదు. పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
2001లో నాల్గవ సంవత్సరం వైద్య విద్యార్థి సౌమిత్ర బిశ్వాస్ మరణించిన తరువాత, అప్పటి సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సంస్థలో అశ్లీలత, వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్న ప్రభావవంతమైన కోటరీని రక్షించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు మొదట మరణాన్ని ఆత్మహత్యగా మార్చడానికి ప్రయత్నించారు. తరువాత ఆధారాలు రావడంతో పోలీసులు యూ టర్న్ తీసుకున్నారు.
దారి తప్పిన వారసత్వం..
“అభివృద్ధి చెందుతున్న జాతీయవాద ఉద్యమం, బ్రిటీష్ ప్రభుత్వ వివక్షపూరిత ప్రవర్తన, అనారోగ్యంతో ఉన్న పేద భారతీయులకు సేవ చేయాలనే గొప్ప తపన, ముఖ్యంగా ప్రతిభావంతులైన యువకులలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనే కోరిక వంటి కారణాలతో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ రాధా గోబిందా కర్ ఈ కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన పుష్‌ని అందించారు, ” అని RG కర్ కు చెందిన పూర్వ విద్యార్థులు నడుపుతున్న వెబ్‌సైట్‌లో సంస్థ చరిత్రపై ఓ వ్యాసం రాసుకున్నారు.
ఇది 1886లో స్థాపించబడిన ఆసియాలో మొట్టమొదటి ప్రైవేట్ వైద్య కళాశాల. దీనికి మొదట కలకత్తా స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని పిలిచేవారు. 1916లో బెల్గాచియా మెడికల్ కాలేజీగా పేరు మార్చుకుంది. మళ్లీ 1918లో కార్మైకేల్ మెడికల్ కాలేజీగా పేరు మార్చుకుంది. దీని గౌరవార్థం 1948లో ప్రస్తుత పేరు వచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1958లో చారిత్రక సంస్థను తన ఆధీనంలోకి తీసుకుంది.


Tags:    

Similar News