ముంబైలో కుప్పకూలిన భారీ అపార్ట్ మెంట్, 15 మంది మృతి

పుట్టిన రోజు వేడుక జరపుకుంటున్న సమయంలో దుర్ఘటన;

Update: 2025-08-28 05:52 GMT
ఇమేజ్ సోర్స్: ఎన్డీఆర్ఎఫ్

ముంబై శివార్లలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక నివాస భవనం కూలిపోవడంతో 15 మంది మరణించారు. అక్కడ నిర్మించిన రమాబాయి అపార్ట్ మెంట్ లోని ఒక బ్లాక్ కూలిపోయిందని అధికారులు తెలిపారు.

జాతీయ మీడియా ప్రకారం.. నాల్గవ అంతస్తులో పుట్టిన రోజు పార్టీ జరపుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఉన్న విరార్ ప్రాంతంలో ఈ మధ్య అనేక భవనాలు కూలిపోవడం సాధారణంగా మారింది. దీనితో నిర్మాణ నాణ్యత, గృహ భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషాదం నేపథ్యంలో ప్లాట్ కొనుగోలు చేసి నివసిస్తున్న యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.
పుట్టిన రోజు వేడుకలు..
ప్లాట్లలో నివసిస్తున్న జోవిల్ కుటుంబం తమ కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో ఏడాది వయస్సున్న ఉత్కర్ష్ ఓంకార్ జోవిల్ చికిత్స పొందుతూ మరణించింది. ఆమె తల్లి 23 ఏళ్ల ఆరోహి సైతం అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమె తండ్రి జాడ ఇప్పటి వరకూ కనిపించడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరితో పాటు అనేకమంది బంధువుల జాడ కూడా కనిపించడం లేదు. ఉదయం వరకు జరిపిన సహాయక కార్యక్రమాల్లో 11 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇందులో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శిథిలాల కింద మరో 10 మంది దాకా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించే కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పక్కన ఉన్న భవనాలను సైతం ఖాళీ చేయించారు.
బిల్డర్ అరెస్ట్
భవనాన్ని నిర్మించిన సాయి దత్తా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యజమాని నిట్టల్ గోపీనాథ్ సానేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై మహారాష్ట్ర ప్రాంతీయ, పట్టణ ప్రణాళిక(ఎంఆర్టీపీ) చట్టం 1966, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు.
కాగా ఈ సమస్య రాజకీయ రంగు పులుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై తాము అనేక దశాబ్ధాలుగా పోరాటాలు చేస్తున్నామని కానీ వీవీసీఎంసీ ఎందుకు మౌనంగా ఉంటుందని శివసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే దీనిలో కలుగ జేసుకుని ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడాలని అనిల్ చవాన్ డిమాండ్ చేశారు. భవనాలు కూలిపోయే దాకా అధికారులు వేడుక చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News