డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ తొలి ప్రెస్ మీట్‌లో హైలైట్స్..
అమెరికా పాలన వ్యవహారాల్లో ఎలాన్ మస్క్ జోక్యం పెరిగిందా? విమర్శకులకు ట్రంప్, మస్క్ సమాధానమేంటి?;
అమెరికా (America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టి నెల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk)తో కలిసి పాల్గొన్న తొలి ప్రెస్ మీట్ మంగళవారం రాత్రి ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైంది. అందులో ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకుంటూ కనిపించారు. అమెరికా పరిపాలనలో మస్క్ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలను కొట్టిపారేశారు.
ప్రెస్ మీట్‌లోని టాప్ 5 పాయింట్స్..
1. మస్క్ ‘ఎన్‌ఫోర్స్ చీఫ్’గా..
తన బాధ్యతలను మస్క్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. గత అధ్యక్షుడి ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదని, వాటి అమలుకు మస్క్ కృషి చేస్తున్నారని చెప్పారు. అధ్యక్షుడి ఉత్తర్వులు అమలయ్యేలా చూడటమే DOGE (Department of Government Efficiency)టీమ్ బాధ్యత అని మస్క్ సమాధానామిచ్చారు. తన విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారని ట్రంప్ చెప్పకనే చెప్పారు.
2. US DOGE సేవలు – ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ మెకానిజం’
ఇటీవల ప్రారంభించిన US DOGE సేవలు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఫెడరల్ బ్యూరోక్రసీలో తన పాలనా విధానాలను నిరాడంబరంగా అమలు చేసే DOGEను ఒక ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ మెకానిజం’గా అభివర్ణించారు డొనాల్డ్.
3. ప్రత్యేక ప్రయోజనాలేమీ ఉండవు..
మస్క్ తన రోల్‌ను "టెక్నాలజిస్టు"గా పేర్కొంటూ.. అధ్యక్షుడికి సాంకేతిక సేవల్లో సాయం చేయడమే తన విధి అని స్పష్టం చేశారు. తన అధికారంపై వస్తున్న విమర్శలకు సమాధానంగా.. ఎన్నికలు లేకుండా నియమితులయిన ప్రభుత్వ అధికారుల అధికారంతో పోలిస్తే తనకు ఉన్న అధికారులు చాలా తక్కువ అని పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనాలు కోరుకోనని, తన వ్యాపారాలకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో ఇకపై పాల్గొననని స్పష్టం చేశారు. ట్రంప్ కూడా ఇదే మాటను పునరుద్ఘాటిస్తూ.. మస్క్ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు పొందినా.. ప్రత్యేక ప్రయోజనాలేమీ ఉండబోవని పేర్కొన్నారు.
4. విద్యా శాఖను రద్దు చేయనున్న ట్రంప్..
అమెరికా విద్యాశాఖను పూర్తిగా రద్దు చేసే ప్రణాళిక ఉందని అయితే సోషల్ సెక్యూరిటీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ట్రంప్ చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం.. విద్యా వ్యవస్థను రాష్ట్రాలకు బదిలీ చేయడం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు, అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుుందని పేర్కొన్నారు.
5. $10 మిలియన్ చెల్లింపుపై సరదా వ్యాఖ్యలు
ట్రంప్, మస్క్ ఇద్దరూ ఇటీవల $10 మిలియన్ చెల్లింపుపై సరదాగా మాట్లాడారు. కేసు పరిష్కారంగా తనకు మస్క్ సామాజిక మాధ్యమ సంస్థ ‘X’ చెల్లించిన మొత్తం తక్కువేనని వ్యాఖ్యానించారు. “ఇది చాలా తక్కువ. నాకు ఇంకా ఎక్కువ వస్తుందని అనుకున్నాను” అని ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హానిటీతో అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ..ఈ వ్యవహారాన్ని పూర్తిగా న్యాయ నిపుణులకు వదిలేశానని వ్యాఖ్యానించారు.