దళితవాడలో కుటుంబాలు 1200
240 మందికే రూ. పది వేలు వంతున పరిహారం
పాక్షికంగా నష్టపోయిన వారికి మళ్లీ ఇస్తాం: కలెక్టర్
2000 ఎకరాల్లో భూములకు నష్టం జరిగింది
సాయం పెంచాలన్న సీపీఎం
నెల కిందట కళత్తూరులో విషాదం.
Full View
చెరువుకు గండి పడి ముంపునకు గురైన కళత్తూరు గ్రామం మెల్లగా కోలుకుంటోంది. ప్రకృతి వల్ల ఏర్పడిన ఇతంటి విధ్వంసం తన సర్వీసులో చూడలేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ కలత చెందారు. నిద్రలో కూడా నన్ను ఆ ఘటన కలవరపరిచిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దళితవాడలో 1,337 ఎకరాల భూములు దెబ్బతిన్నట్లు చెప్పిన ఆయన గ్రామంలోని దళితులను మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగులు వేయించేందుకు ఆసరా ఇస్తున్నామని చెప్పారు. నెల కిందట జరిగిన ఈ దుర్షటనను గుర్తు చేసుకున్న ఆయన తీవ్ర మానసిక వేదనకు లోనట్లు ఆయన మాటలే చెప్పాయి.
ఆదుకుంటాం...
కళత్తూరు దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రకటించారు. ఆధార్ కార్డులు జారీ చేయడానికి క్యాంపులు ఏర్పాటు చేయడం, పాడి ఆవుల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూ చేయిస్తామన్నారు.
నష్టం అపారం..
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపరం మండలంలోని కళత్తూరు దళితవాడ అల్లకల్లోలమైంది. సరిగ్గా నెల కిందట ఎగువ ప్రాంతంలోని రాయలచెరువు కట్ట తెగింది. ఈ వరదనీటి ఉధృతికి తీవ్ర నష్టం వాటిల్లింది. కళత్తూరు దళితవాడలోని 1,200 కుటుంబాల్లో నష్టం జరగని గడప లేదు. ఆవులు కొట్టుకొనిపోవడంతో అప్పుల పాలైన కుటుంబాలు వందల్లో ఉన్నాయి. గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దడానికి తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. ఎన్ని వందల ఎకరాలు ఇసుక మేటలతో నష్టపోయారు. ఎన్ని ఆవులు కొట్టుకుని పోయాయి. జరిగిన నష్టం ఎంత అనేది లెక్కలు మాత్రం తేలలేదు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, అధికారులతో కలిసి సోమవారం కళత్తూరు దళితవాడలో గ్రామసభ నిర్వహించారు. ప్రముదాన్ని ముందుగాన పసిగట్టి. గ్రామస్తులను అప్రమత్తం చేసిన పుత్తూరు డీఎస్పీ, రూరల్ సీఐ, కేవీబీపురం ఎస్ఐలను కలెక్టర్ అభినందించారు. దళితవాడలో ప్రజలు మళ్లీ సాధారణ జీవనం ప్రారంభించే దిశగా ప్రభుత్వం నుంచి అందించే సహాయాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు.
కళత్తూరు గ్రామంలో వరదముంపు వల్ల వందలాది పశువులు నీటితో కొట్టుకొనిపోయాయి. ఇంకొన్ని గ్రామంలోనే చనిపోయాయి. కట్టుబట్టలు మినహా, ఇళ్లలోని సామాగ్రి మొత్తం బురదతో పాడయ్యాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాకుండా పోయాయి. 1,200 కుటుంబాలు ఉన్న ప్రతి ఇంటిలో నష్టం జరగని గడప లేదు. పొలాలన్నీ ఇసుక మేటలతో పనికిరాకుండా పోయాయి. బ్యాంకుల నుంచి రుణం, చేతిబదుళ్లు, ఇతర ఆర్థిక వనరులతో కొనుగోలు చేసిన పాడి ఆవులు కొట్టుకుపోవడం వల్ల వందల సంఖ్యలో దళిత కుటుంబాలు అప్పులపాలయ్యాయి.
"చనిపోయిన, వరదలో కొట్టుకుపోయిన ఆవులకు పరిహారం చెల్లించాలి. బాధితులకు పరిహారం పెంచాలి" అని సీపీఎం నేత జనార్థన్ కోరారు.
నష్టం స్వల్పమేనా..
కళత్తూరు గ్రామాన్ని ముంచెత్తిన వరదనీరు తొమ్మిది అడుగులో ఎత్తులో ప్రవహించింది. గ్రామంలో అపార నష్టం జరిగినట్టు పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ మంగళవారం చెప్పిన వివరాలు పరిశీలిస్తే, నష్టం తక్కువగానే అంచనా వేశారనే విషయం స్పష్టం అవుతోంది.
"కళత్తూరులొ జరిగిన విద్వంసం నా సర్వీస్ లొ చూడలేదు" అని గ్రామంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అధికారుల శ్రమ ప్రశంసనీయం అని ఆయన అభినందించారు.
కలెక్టర్ వెంకటేశ్వర్ ఏమి చెప్పారంటే..
"గ్రామంలో ప్రతీ ఒక్కరికి సిలిండర్లు ఇప్పిస్తాం. గ్రామంలొ ఆధార్, బ్యాంక్ క్యాంపులు నిర్వ హించి రెండు రోజుల్లొ కార్డులు ఇస్తాం" అని హామీ ఇచ్చారు.
కళత్తూరు దళితవాడలో జరిగిన నష్టంపై ఎలా మదింపు వేశారో తెలియదు. కానీ, ఇసుక మేటలు కట్టిన సుమారు 1,050 ఎకరాలకు నష్టపరిహారం ఇప్పిస్తాం అని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కోతకు గురైన సుమారు 287 ఎకరాలకు నష్టపరిహారం ఇస్తాం అని కూడా వెల్లడించారు. మృతి చెందిన పశువులు, మేకలకు తగిన నష్టపరిహారం కచ్చితంగా చెల్లిస్తాం అని స్పష్టం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సందర్భాల్లో చెల్లించే నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకే అధికారులు ఆ విధంగా సాయం అందించడానికి చర్యలు తీసుకుంతారనడంలో సందేహం లేదు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ గ్రామంలో నెలలోపు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
"ఇసుక మేటలు వేసిన పొలాలు, కోతకు గురైన పంట భూములకు నష్టపరిహారం అందించే విధంగా కృషి చస్తా" అని ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పారు. మృతి చెందిన మూగ జీవాలకు కచ్చితంగా నష్ట పరిహారం చెల్లించడమే కాకుండా వ్యవ సాయ భూములను సాగులోకి తెచ్చుకు నేందుకు కూడా మార్గం కల్పిస్తామని తెలిపారు.
ఇచ్చింది స్వల్పమే..
సత్యవేడు నియోజకవర్గంలోని కళత్తూరు గ్రామంలో మంగళవారం రూ. పది వేల వంతున కేవలం ఎక్కువగా నష్టపోయిన 421 మందికి ఆర్థికసాయం చెక్కులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ పరిహారం చూసిన గ్రామస్తులే నివ్వెరపోయారు. పాక్షికంగా నష్టపోయిన వారికి తరువాత పరిహారం చెల్లించడానికి హామీ ఇచ్చారని కేవీబీపురంలో సీనియర్ జర్నలిస్టు భాగ్యరాజ్ చెప్పారు.
"వాస్తవానికి జరిగిన నష్టానికి చెల్లించిన పరిహారానికి పొంతన లేదు" అని భాగ్యరాజ్ అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది నవంబర్ నెల ఆరో తేదీ కళత్తూరు గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఆ మరుసటి రోజు గ్రామంలో "ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధి సందర్శించారు. అదే సమయంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి ట్రైనీ కలెక్టర్ తో గ్రామంలోనే మకాం వేసి, పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే.
"పాడి ఆవులకు సంబంధించి ప్రత్యేకంగా అదనపు పరిహారం చెల్లించడానికి సిఫారసు చేస్తాం. ఎన్యూమరేషన్ చేస్తాం" అని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామంలో వేడి తగ్గింది. విషాదం నుంచి కోలుకునే ప్రయత్నాలు ఉన్న దళితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే, మానవతా దృక్పథంతో మరింత మేలు జరిగే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది.
బాధితులకు పరిహారం పెంచాలి
కళత్తూరు దళితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారంపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి దాసరి జనార్ధన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నష్టపోయిన వారిలో కొందరికి మాత్రమే రూ. పది వేలు పరిహారం చాలదని, కనీసం 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
"జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వం తరఫున రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి పదివేల రూపాయలు పరిహారం ప్రకటించారు. ప్రతి ఇంటిలో కనీసం లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు టీవీలు, ఫ్రిజ్ లు,వాషింగ్ మిషన్ లు ఇతర నిత్యావసర వస్తువులు సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం వల్ల ఏమి న్యాయం జరుగుతుంది?" అని ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు 900 పైగా చనిపోయాయి. కేవలం 625 మాత్రమే చనిపోయినట్టు, వాటికి మాత్రమే పరిహారం ప్రకటించడం దారుణం. 1,050 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇసుకమేట వేసింది. కేవలం 287 ఎకరాలు నీటి ప్రవాహానికి కోతకు గురయ్యాయని అధికారులు లెక్కలు తేల్చాడం కరెక్ట్ కాదు" అని జనార్థన్ అభ్యంతరం చెప్పారు.
2000 ఎకరాల్లో నష్టం
పాతపాలెం ,ఎస్ ఎల్ పురం, ఓళ్లూరు , కళత్తూరు గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలకు పైగా ఇసుక మేటలు వేసి, వరద ప్రవాహానికి కోతకు గురైన భూములు ఉన్నాయని జనార్ధన్ తెలిపారు. మరియు సాగునీటి బావులు, సాగునీటి బోర్లు ,విద్యుత్తు స్టార్ట్ లు ,మోటర్లు, పైపులు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు లాంటివి కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని జనార్దన్ వివరించారు. మెట్ట ప్రాంతంలో రైతు కుటుంబానికి రెండు ఎకరాలు సాగు భూమి, ఐదు సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని జనార్ధన్ విజ్ఞప్తి చేశారు.
30 ఏళ్ల వెనక్కు..
కళత్తూరు దళితవాడ వద్ద జరిగిన గ్రామసభలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజి, సీసీ రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. వరదనీటి ముప్పు వల్ల గ్రామం 30 ఏళ్ల వెనక్కి వెళ్లిందని జనసేన నేత థామస్ అధికారులతో అన్నారు.
"రుణాలు మంజూరు చేయించడంతో పాటు మరింత సాయం అందించడానికి శ్రద్ధ తీసుకోండి " అని థామస్ కోరారు.
అరుణాచలం అనే వ్యక్తి మాట్లాడుతూ, వ్యవసాయ భూములను సాగులోకి తెచ్చుకునేందుకు ఉపాధి పనులు కేటాయించాలని కోరారు.
గ్రామంలో వరదనీటి వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలి నష్టపోయారని వినీత్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీటిలో సర్టిఫికెట్లతో పాటు భూమి పట్టాలు,ఆధార్ కార్డులు కూడా కొట్టుకుపోయాయని గుర్తు చేశారు.
"గ్రామంలో ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయిస్తాం. తద్వారా అందరికీ మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం" అని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.