అయోధ్య రామాలయం ముందు చెప్పుల గుట్టలు.. తీసుకెళ్లని భక్తులు..

అయోధ్య రామ్‌లల్లా ఆలయంలో భక్తుల నియంత్రణకు తీసుకున్నఏర్పాట్ల వల్ల కొత్త సమస్య తలెత్తింది. భక్తులు తమ చెప్పులను ఆలయ ప్రవేశద్వారం వద్దే వదిలేసి వెళ్లిపోతున్నారు.;

Update: 2025-03-03 13:15 GMT

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రామాలయ సందర్శనకు వచ్చే భక్తులు తమ చెప్పులను ప్రవేశ ద్వారం గేట్ నంబర్ 1 వద్ద భద్రపరిచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. బాలరాముడిని దర్శించుకున్న తర్వాత తిరిగి అదే ద్వారం గుండా బయటకు వచ్చి చెప్పులు వేసుకునే వారు. కానీ కుంభమేళా సందర్భంగా భక్తుల సంఖ్య విఫరీతంగా పెరిగిపోవడంతో ఆలయ ట్రస్ట్ కొన్ని మార్పులు చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust) సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. దర్శనం తర్వాత భక్తులను గేట్ నంబర్ 3 నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ గేట్ నుంచి బయటకు వచ్చి చెప్పులు తీసుకోవాలంటే భక్తులు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం నడవాలి. దీంతో అంత దూరం నడవలేక భక్తులు తమ చెప్పులను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద చెప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఆలయ ప్రధాన ద్వారం లక్షల సంఖ్యలో వదిలేసిన చెప్పులను జేసీబీతో వాటిని ట్రాక్టర్లలో వేసి 4-5 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో పడేస్తున్నారు. ఈ సమస్య అయోధ్య మున్సిపల్ అధికారులు తలనొప్పిగా తయారైంది. దీంతో ఆలయ అధికారులు మరిన్ని మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కోటి మందికి పైగా భక్తులు..

మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు 45 రోజుల పాటు జరిగిన మహా కుంభ మేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వీరిలో చాలామంది అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. మొత్తం 1.25 కోట్లు పైగా భక్తులు రామ్‌లల్లా(Ram Lalla)ను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News