Delhi Polls | ఉచితాలతో ఊదరగొడుతున్న AAP, BJP
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలన్న బీజేపీ ఆశ నెరవేరుతుందా? అందుకు ఆప్ తరహాలోనే పథకాలు అమలు చేయాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారా?;
ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆప్(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మహిళలు, వృద్ధులు, పేదలను లక్ష్యంగా చేసుకుని పథకాల రూపకల్పన చేస్తున్నారు.
మహారాష్ట్ర, హర్యానా విజయాలు నుంచి ప్రేరణ..
హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాల వల్లే పవర్‌లోకి వచ్చామని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీలో కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉండగా.. అధికార ఆప్, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ.. మహిళల మద్దతు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఆప్ ముందంజ..
మహిళల కోసం పలు పథకాలను ప్రకటించడంలో ఆప్ ప్రభుత్వం ముందంజలో ఉంది. "మహిళా సమ్మాన్ యోజన" కింద రూ. 2,100 అందజేస్తామని ఆప్ తెలిపింది. బీజేపీ కూడా దీనికి పోటీగా రూ. 2,500 ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ పథకం మొదటగా 2023 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అమలు చేసి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ పథకాన్ని హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తూ విజయవంతమైంది.
బీజేపీ మరో హామీ..
ఆప్ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ..అధికారంలోకి వస్తే అన్ని పథకాలను కొనసాగించడమే కాకుండా అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ ప్రతినిధి గుప్తా హామీ ఇచ్చారు.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం..
ఆప్, బీజేపీ రెండూ పేదలు, మహిళలు, వృద్ధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. "ఢిల్లీ జనాభాలో కనీసం మూడో వంతు అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు ఉంటారు. వీరి మద్దతు పార్టీలకు అవసరం," అని లోకనీతి-CSDS సహ-నిర్వాహకుడు డా. సంజయ్ కుమార్ చెప్పారు."ఢిల్లీ రాజకీయాల్లో ప్రజాహిత పథకాల పోటీ కొనసాగుతోంది. బీజేపీ, ఆప్ పంథాను అనుసరిస్తోంది," అని అభయ్ కుమార్ దూబే అభిప్రాయపడ్డారు.
పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి 26 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని బీజేపీ భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయవంతమయినా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఆప్ పథకాల కంటే మెరుగైన పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా, జాతీయ పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తోంది కాషాయ పార్టీ. "ఆయుష్మాన్ భారత్," పట్టణ గృహ యోజన, జనధన్, పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలను ఢిల్లీలో అమలు చేయడమే బీజేపీ లక్ష్యం.