జూన్ 2 న వెళ్లి.. 5న బయటకు వస్తా: కేజ్రీవాల్

ఈ ఎన్నికల్లో ఇండి కూటమి గెలిస్తే తాను ఒక్కరోజులో బయటకు వస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంటే నేను కూడా నమ్మానని చెప్పారు.

Update: 2024-05-14 06:43 GMT

ఎన్నికల ఫలితాల్లో ‘ఇండి కూటమి’ గెలిస్తే జూన్ 2న తీహార్ జైలుకు వెళ్లి, జూన్ 5న తిరిగి బయటకు వస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు జూన్ 1 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2 న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏడు దశల ఎన్నికలకు జూన్ 1 చివరి రోజు కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, తాను సిసిటివి నిఘాలో ఉన్నానని, తనను నిరంతరం 13 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.గత కొన్ని రోజులుగా, దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు, ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల నుంచి ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వనాలు అందుతున్నాయని చెప్పారు.
"నేను ఇండి కూటమికి ప్రచారం చేయడానికి రాబోయే 21 రోజుల్లో చాలా ప్రదేశాలకు వెళ్తాను. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాల నుంచి వ్యక్తిగత అభ్యర్థుల నుంచి కూడా నాకు ఆహ్వానాలు అందుతున్నాయి. నేను వీలైనన్ని ఎక్కువ చోట్లకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను’’ అని చెప్పారు.
‘‘ఆప్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి మనం గెలిస్తే తిరిగి జూన్ 5 న నేను బయటకు వస్తాను’’ అని కార్యకర్తలను ఉద్దేశించిన కేజ్రీవాల్ హితబోధ చేశారు. ఒకవేళ ఓడిపోతే మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని అన్నారు. తనను అరెస్టు చేసినప్పుడు ఆరు నుంచి ఏడు నెలల పాటు జైలులో ఉండాల్సి వస్తుందని భావించానని కేజ్రీవాల్ తన మనసులో మాట బయట పెట్టారు.అందుకు మానసికంగా సిద్ధమయ్యాను.. మధ్యలో తిరిగి వస్తానని అస్సలు ఊహించలేదు.. అద్భుతం జరిగింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేవుడు చేసిన అద్భుతంగా ఆప్ అధినేత అభివర్ణించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, జైలులో తన రోజుల అనుభవాన్ని పంచుకుంటూ, తన సెల్‌లో రెండు సిసిటివి కెమెరాలు అమర్చబడి ఉన్నాయని చెప్పారు, "నేను ఏ సమయానికి నిద్ర లేస్తాను, ఎన్ని గంటలకు పడుకుంటాను, నేను ఏ టివి ఛానెల్‌లు చూస్తున్నాను, నేను ఏం తింటున్నాను. బాత్రూమ్ కు ఎప్పుడు వెళ్తాను. ఎప్పుడు నిద్రపోతాను" వంటివన్నీ రికార్డు చేశారని చెప్పారు.
ఈ రికార్డింగ్ కోసం 13 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. ఈ వ్యక్తులు నేను చేస్తున్న ప్రతిదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు అధికారులు ఇదే సమాచారాన్ని ప్రధానమంత్రి ఆఫీసుకు కూడా నివేదించారని అన్నారు. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీని అణచివేయడానికి కుట్రలు పన్నాడని ఆరోపించారు. కానీ దేవుడు నాతో ఉన్నాడని అన్నారు. జైలులో ఉన్న 15 రోజుల్లో తనకు ఇన్సులిన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
"నేను 20 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నాను. గత 10 సంవత్సరాలుగా ఇన్సులిన్ వాడుతున్నాను, నాకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ, నేను రోజుకు 52 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాను, ఇది చాలా ఎక్కువ," అని ఢిల్లీ సీఎం చెప్పాడు.
తాను జైలుకు వెళ్లినప్పుడు రోజురోజుకు షుగర్ లెవెల్ పెరుగుతోందని, సరిపడా ఇన్సులిన్ ఇవ్వకుండా వేధించారని అన్నారు. సరైన సమయానికి ఇన్సులిన్ ఇవ్వపోతే మూత్రపిండాలు సహ ఇతర కీలక అవయవాల పనితీరు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్యతో మాట్లాడటానికి కూడా జైలు అధికారులు అనుమతించలేదని అన్నారు.
‘‘ఖైదీలు తమ కుటుంబాలను కలవడం వారి హక్కు. ఖైదీ అయినా, ఉగ్రవాది అయినా, రేపిస్టు అయినా, హంతకులైనా వారానికి రెండుసార్లు తమ కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఉంది.
‘‘ఒకరోజు జైలు అధికారులు నా భార్యతో మీటింగ్‌ను రద్దు చేశారు... ఈ విషయమై గొడవ జరిగిన తర్వాతే ఈ వ్యక్తులు 11 గంటలకు నా భార్యకు మీరు మీటింగ్‌ పెట్టుకోవచ్చని మరో మెయిల్‌ చేశారని అన్నారు. మూడు నెలల క్రితం వరకు బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయని అనిపించిందని కేజ్రీవాల్ అన్నారు.
‘‘గత మూడు నెలల్లో అకస్మాత్తుగా ఎన్నో పెద్ద ఘటనలు జరిగాయి.. ఈరోజు దేశంలో తమకు (బీజేపీకి) 400 సీట్లు వస్తాయో లేదోనని పందెం కాసుకుంటున్నారు. ఇది దేవుడి దయ అని ఆయన అన్నారు.


Tags:    

Similar News