ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆర్నెళ్ల పాలన: అమలు కాని ఎన్నికల హామీలు..
ఆరు మాసాల్లోనే ప్రజా వ్యతిరేకత ఎదురైందా? వీధి కుక్కల బెడద, ఫ్యూయల్ బ్యాన్, మురికివాడల కూల్చివేతపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా?;
ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Rekha Gupta)పై ఆగస్టు 20వ తేదీ ఉదయం దాడి జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆమెపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన పాలనా వైఫల్యానికి నిదర్శనమని, ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
యాక్సిడెంటల్ సీఎం..
రేఖాగుప్తా సీఎం(CM) కావడం ఊహించని పరిణామం. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఊహించిన వారు కూడా చాలా తక్కువ. ఢిల్లీ బీజేపీ(BJP)కి చెందిన కొంతమంది ప్రముఖులు ఆ పదవికి పోటీలో ఉన్నారు. అలాంటివారిలో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ ఒకరు. అయినప్పటికీ గుప్తాను ఎంచుకున్నారు.
వాస్తవానికి ఆమె ఒక మున్సిపల్ మాజీ కౌన్సిలర్. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. తొలి విజయంతోనే ముఖ్యమంత్రి పదవికి ఎదిగారు. గతంలో DUSU అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం, RSSతో దగ్గర సంబంధాలు ఉండడం, వైశ్య సమాజ నేపథ్యం.. మహిళ కావడం ఆమెకు కలిసొచ్చింది.
అమలు కాని ఎన్నికల హామీలు..
పాలనా పగ్గాలు చేపట్టి ఆరు మాసాలు గడిచినా ఎన్నికల హామీలు ఇంకా అమలు కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు .. మహిళలకు ఆర్థిక సాయం, పండుగల వేళ ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. కాని 180 రోజులు గడిచినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.
సుప్రీ తీర్పు ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమా?
సుప్రీంకోర్టు(Supreme court) వీధికుక్కల సమస్యను సుమోటోగా స్వీకరించి వాటిని డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా కుక్కల ప్రేమికుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ కేసును ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమర్థవంతంగా వాదించలేకపోవడంతోనే సుప్రీం అలా తీర్పు ఇచ్చిందని రేఖాగుప్తాను విమర్శించారు. చివరకు వీధి కుక్కల బెడదతో ఢిల్లీ పౌరులు విసుగు చెందారని, అదే సమయంలో సుప్రీం తీర్పును రేఖాగుప్తా సమర్థించాల్సి వచ్చింది. అంతకుముందు వీధుల నుంచి వీధి ఆవులను కూడా తొలగించాలని సూచించిన ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
సొంత నిర్ణయాలే కారణమా?
రేఖాగుప్తా ఆరుమాసాల్లోనే వ్యతిరేకతను ఎదుర్కోడానికి ప్రభుత్వ తన సొంత నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మురికివాడలను తొలగిస్తామని బీజేపీ చెప్పింది. పవర్‌లోకి రాగానే ఆ పని మొదలుపెట్టింది. అయితే కోర్టు ఆదేశం మేరకే కూలుస్తున్నామని చెప్పుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూల్చివేతలను ఖండించింది. ముఖ్యమంత్రి అనుకుంటే వాటిని ఆపగలరన్నది ప్రతిపక్ష AAP వాదన.
ఫ్యూయల్ బ్యాన్..
పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా రేఖా గుప్తా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోడానికి మరో నిర్ణయం తీసుకుంది. 10 నుంచి 15 ఏళ్ల పూర్తి చేసుకున్న వాహనాలపై ఇంధన నిషేధాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చర్యకు ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రెండు రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వాహన వయస్సు ఆధారంగా కాకుండా దాని ఇంజిన్ స్థితిని బట్టి ఫిట్‌నెస్ నిర్ధారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘గుప్తా పరిస్థితి.. మాజీ సీఎం షీలా దీక్షిత్ పరిస్థితి ఒకటే..’
సీనియర్ జర్నలిస్ట్ రత్నేష్ మిశ్రా మాట్లాడుతూ.. మహిళా ముఖ్యమంత్రిపై దాడి ఖండించదగినదే అంటూనే.. గుప్తా పరిస్థితిని గత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరిస్థితితో పోల్చారు. ‘‘ఆమెకు కూడా తొలిసారి సీఎం అయినప్పుడు పెద్దగా తెలియదు. కానీ 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించారు.’’ అని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా సీఎం పదవికి కొత్త ముఖాలే అయితే ఇలాంటి వివాదాలను దూరంగా ఉంటూ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.
హింసకు తావులేదు: కేజ్రీవాల్
AAP అధినేత కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా రేఖాగుప్తాపై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే.. అయితే హింసకు తావులేదని నొక్కి చెప్పారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుప్తా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి అతిశీ కూడా దాడిని ఖండించారు.
కానీ AAP ఢిల్లీ కన్వీనర్ సౌరభ్ భరద్వాజ్ ఈ ఘటనను మరో కోణంలో చూశారు. రేఖాగుప్తాపౌ దాడి ప్రజల విసుగెత్తిన పాలకు నిదర్శనం అని పేర్కొన్నారు.
‘సానుభూతి పొందేందుకే...’
కొంతమంది AAP నాయకులు దాడి కుట్రపూరితంగా జరిగిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకత నుంచి సానుభూతి పొందేందుకు దాడి ఘటనను తెరమీదకు తెచ్చారని కిరారి ఎమ్మెల్యే అనిల్ ఝా ఆరోపించారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమెతో తనకున్న పాత అనుబంధాన్ని ఉదహరిస్తూ.. సానుభూతి పొందడానికి గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆయన గుర్తు చేశారు.
సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?
ఢిల్లీ కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ దాడిని ఖండించారు. అయితే పోలీసుల వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. రాజధానిలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. "స్వయంగా ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే రాత్రిపూట తిరిగి వచ్చే శ్రామిక మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.