బీజేపీ నేత రమేశ్ బిధూరి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీ సీఎం అతిశీ
కల్కాజీ(Kalkaji) నియోజకవర్గం పోటీ చేస్తున్న ఢిల్లీ సీఎం అతిశీ (Atishi) గురించి బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.;
ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అతిశీ (Atishi) కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ (BJP) నేత రమేశ్ బిధూరి (Ramesh Bidhuri) వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా బాధించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిశీ కల్కాజీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున రమేశ్ బిధూరి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఇంతకు రమేశ్ ఏమన్నారు?
ఆదివారం రోహిణిలోని జపనీస్ పార్క్‌లో జరిగిన బహిరంగ సభలో బిధూరి ప్రసంగించారు. ‘‘సీఎం అతిశీ ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు.’’ అని అన్నారు. అతిషి ‘మార్లెనా’ అనే తన ఇంటిపేరు వాడటం మానేయడంపై.. “మార్లెనా సింగ్ అయిపోయింది. తండ్రిని మార్చుకుంది. ముందు మార్లెనా.. ఇప్పుడు సింగ్ అయ్యింది” అని వ్యాఖ్యానించారు.
బిధూరి వ్యాఖ్యలపై స్పందించిన అతిశీ, “నా తండ్రి ఒక టీచర్. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పారు. ఆయనకు ఇప్పుడు 80 ఏళ్లు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఒకరి సాయం లేకుండా నడవలేరు. ఓటమి భయంతో ఒక వృద్ధుడిని దూషించడమా? ఇంతటి నీచ రాజకీయాలు మన దేశంలో ఉంటాయని నేను ఊహించలేదు” అని కంటతడిపెట్టారు.
అతిశీపై రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో..నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ‘ది ఫెడరల్ కాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్‌లో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ శశి శేఖర్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్ టీకే రాజలక్ష్మి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనుమా ఆచార్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రమేశ్ బిధూరి వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని పత్రికా రచయిత రాజలక్ష్మి బిధూరి పేర్కొన్నారు. “బీజేపీ అగ్రనాయకత్వం బిధూరి వ్యాఖ్యలను ఖండించకపోవడం..పరోక్షంగా ఆయన వ్యాఖ్యలను సమర్ధించినట్లేనని అన్నారు.
ఆచార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కాల్కాజీ నియోజకవర్గంలో ఉన్న విద్యావంతులైన ఓటర్లు బిధూరి వ్యాఖ్యలను సమర్థించరని,” అన్నారు. ఇటువంటి వ్యూహాలు పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు. “ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీస్తాయి కానీ, వారి వాస్తవ సమస్యలను పరిష్కరించవు,” అని ప్రొఫెసర్ సింగ్ అన్నారు. ఎన్నికల సంఘం, జాతీయ మహిళా కమిషన్ బిధూరి వ్యాఖ్యలపై స్పందించకపోవడంపై రాజలక్ష్మి తప్పబట్టారు. “బహిరంగంగా లైంగిక వివక్ష కనిపిస్తున్నప్పుడు ఈ సంస్థలు ఎక్కడున్నాయి?” అని ఆమె ప్రశ్నించారు.