ఇక అధిక పీజులుండవు.. నియంత్రణ బిల్లుకు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం..
ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు.. ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేఖా గుప్తా..;
ప్రైవేటు పాఠశాలల్లో ( Private Schools) ఫీజుల దోపిడీకి ఢిల్లీ(Delhi) ప్రభుత్వం అడ్డుకట్టవేయబోతుంది. ఫీజుల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన బిల్లును క్యాబినెట్ కూడా ఆమోదించింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా్(CM Rekha Gupta)కు ఇటీవల ఫిర్యాదులు అందడంతో ఆమె ఈ చర్య తీసుకున్నారు.
కొన్ని పాఠశాలల యాజమన్యాలు ఫీజు చెల్లించలేదని పరీక్షలకు హాజరుకానివ్వడం లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. తరగతి గదిలోకి కూడా అనుమతించకపోవడంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న సీఎం గుప్తా అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పిల్లల విద్య హక్కును కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజు (ఏప్రిల్ 16న) ఢిల్లీ ప్రభుత్వం 600 ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసింది.
‘‘మొత్తం 1,677 ప్రైవేట్, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నాం. ఏ క్లాస్‌కు ఎంత ఫీజు వసూలు చేయాలో త్వరలో నిర్ణయిస్తాం. చరిత్రలో ఇలాంటి బిల్లును తీసుకురావడం ఇదే ప్రథమం,’’ అని చెప్పారు సీఎం.
గత ప్రభుత్వమే కారణం..
అధిక ఫీజుల వసూలుకు మునుపటి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వమే కారణమని రేఖా గుప్తా ఆరోపించారు. ఫీజులను ఇష్టానుసారం పెంచుతూ పోతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.
కొత్త కమిటీల ఏర్పాటు..
విద్యా శాఖ మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ.. ‘‘ మూడు ప్యానెళ్లు కమిటీ ఫీజులను నిర్ణయిస్తుందని చెప్పారు. స్కూల్‌లో మౌలిక వసతుల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తాయని చెప్పారు. ఒక కమిటీలో ‘‘ముగ్గురు ఉపాధ్యాయులు, ఐదుగురు తల్లిదండ్రులు ఉంటారని, వీరందరిని డ్రా ద్వారా ఎన్నుకుంటారని సూద్ వివరించారు. ప్రతి జిల్లాలో పదిమంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారని, ఇందులో ఇద్దరు మహిళలు, ఒకరు ఎస్సీ, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారని చెప్పారు.