‘కాంగ్రెస్‌వి అవకాశవాద రాజకీయాలు’

హిందువులను విభజించి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక వ్యూహమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Update: 2024-10-09 12:51 GMT

హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందువుల మధ్య చిచ్చుపెట్టి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో రూ.7,600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హిందువులను విభజించి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక వ్యూహమని మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు కుల విభేదాలను ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ముస్లింలలో భయాన్ని నింపి వాళ్లను ఓటు బ్యాంకుగా మార్చుకుందని మోదీ పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలకు మేలు చేసే బీజేపీ అజెండాకు భిన్నంగా భయాందోళనలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కారణంగా బలహీనపడ్డ మహారాష్ట్రను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనలో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల గురించి వివరించారు.  

Tags:    

Similar News