‘సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు’
బీహార్ ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ(PM Modi) బీహార్(Bihar)లోని మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) కూటమిపై విరుచుకుపడ్డారు. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇటు ఇండియా కూటమి(I.N.D.I.A Alliance), అటు ఎన్డీఏ(NDA) కూటమి నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మోదీ ఆదివారం (నవంబర్ 2) భోజ్‌పూర్, నవాడా జిల్లాల్లో ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్(Tejashwi Yadav)ను మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించే స్థితిలో కాంగ్రెస్(Congress) లేదన్నారు. "కాంగ్రెస్ ఎప్పుడూ ఆర్జేడీకి అనుకూలంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని అనుకోలేదు. కాంగ్రెస్ తలపై ఆర్జేడీ తుపాకీ పెట్టి ఒప్పించుకుంది. ’’ అని ఆరోపించారు.
బీహార్‌లో ఆర్జేడీ ఓడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. పోలింగ్ ముగిసిన తర్వాత రెండు ప్రతిపక్ష పార్టీలు నాయకులు కొట్లాడుకుంటారని చెప్పారు. ఇప్పటికే విబేధాలు ముదిరాయని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆర్జేడీ తన అభ్యర్థిని నిలబెట్టిందన్నారు.
‘మాదే విజయం..’
ఈ ఎన్నికలలో అధికార ఎన్డీఏ మళ్లీ పగ్గాలు చేపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ విజయం సాధించి రికార్డు బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
‘రాజకుటుంబానికి నిద్రపట్టలేదు..’
కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ సహా ఇతర అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నప్పుడు.. కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరవైందన్నారు. ‘జాతీయ భద్రత, సైన్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ను అమలు చేస్తోందన్నారు.
ఇందిరా గాంధీ హత్య అనంతరం చెలరేగిన హింసను ప్రస్తావిస్తూ.. ‘‘1984లో దాదాపు ఇదే సమయంలో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోశారు. ఈ మారణహోమం విషయంలో కాంగ్రెస్ ఇంకా క్షమాపణ చెప్పలేదు. దోషులను ప్రోత్సహిస్తోంది’’ అని ఆరోపించారు.